Pune Boy Death: బొమ్మకు ఉరి వేసిన బాలుడు, వెంటనే తానూ ఆత్మహత్య - ఎందుకో చెప్పిన పోలీసులు
Pune Boy Suicide: బొమ్మ చనిపోయిందని 8 ఏళ్ల బాలుడు భావించాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను అదే టవల్‌తో కిటికీకి ఉరి వేసుకుని చనిపోయాడు.
Pune Boy Death: పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పుణెలోని పింప్రీ చించ్వాడ్ ప్రాంతంలో 8 ఏళ్ల బాలుడు ఓ బొమ్మకు ఉరి వేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడు బొమ్మకు ఉరి వేసిన గుడ్డతోనే తన గొంతుకు ఉరి బిగించుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన నగరం మొత్తం సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. 8 ఏళ్ల బాలుడు ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అతని తల్లి కూడా ఇంట్లోనే ఉంది. బాలుడు బొమ్మలతో ఆడుకోవడంతో తల్లి వేరే ఇతర పనుల్లో బిజీబిజీగా ఉంది.
పింప్రీ చించ్వాడ్ ప్రాంత పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాలా సేపటి వరకు ఆ చిన్నారి దగ్గర ఉన్న ఆట బొమ్మ సౌండ్ ఏదీ వినిపించకపోవడంతో తల్లి చూసింది. దాంతో ఆ బొమ్మ కిటికీకి వేలాడుతూ కనిపించింది. తన బొమ్మకు బాలుడు టవల్ ను బిగించి వేలాడదీశాడు. టవల్ వేలాడదీయడంతో బొమ్మ చనిపోయిందని 8 ఏళ్ల బాలుడు భావించాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను అదే టవల్‌తో కిటికీకి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుటుంబంతో సహా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
పుణెలో భారీ కుంభకోణం వెలుగులోకి..
పూణె నగరంలో భారీ భూ కుంభకోణం ఇటీవల వెలుగు చూసింది. తప్పిపోయిన, మరణించిన వారి భూములను ఇక్కడ కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. భూముల క్రయ, విక్రయాల ఏజెంట్లు ఈ మోసానికి పాల్పడుతున్న అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఈ ఏజెంట్లు అలాంటి భూమిని కనిపెట్టి, మొదట భూమి యజమాని నకిలీ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డును తయారు చేసి, ఆపై భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. పుణెలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించి ఐదుగురు ఏజెంట్లతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.
భూముల దందా ఇలా..
ఈ మోసంపై పోలీసు అసిస్టెంట్ కమిషనర్ గజానన్ టోంపే సూచనల ప్రకారం.. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజయ్ వాగ్మారే, అతని బృందం విచారణ చేపట్టారు. నిర్లక్ష్యానికి గురైన భూమికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా నిందితులు గూగుల్ మ్యాప్, ఇతర ఏజెంట్ల ద్వారా తెలుసుకుంటారని పోలీసులు తెలిపారు. దీని తరువాత, ఆ భూములు ఎవరికి చెందినవో.. అతను తప్పిపోయాడా లేదా అతను చనిపోయాడా అనేది గుర్తిస్తారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు తీస్తారు.
ఆ తర్వాత నిందితులు సయ్యద్ హుస్సేన్, మహ్మద్ యూనస్ సాయంతో భూ యజమానికి సంబంధించిన నకిలీ పత్రాలు సిద్ధం చేస్తారు. మరోవైపు నకిలీ వ్యక్తిని సృష్టించి భూమి యజమాని పేరిట బ్యాంకు ఖాతా తెరిపిస్తారు. ఆ తర్వాత ఆ భూమిని అమ్మేస్తారు. నిందితులు కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులు తెలుసుకుని అందరినీ అరెస్టు చేశారు. వారిని విచారణ జరిపి ఇప్పటివరకు విక్రయించిన భూములన్నింటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.