ప్రమాదం కాదు-మూకుమ్మడి హత్యలే!- మంచిర్యాల ఘటనలో సరికొత్త కోణం!
ఈ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా... ఒకరు మాత్రం బయట వ్యక్తి. ఆయన పేరు శాంతయ్య. ఈయన కారణంగానే ఇంత దారుణం జరిగిందని స్థానికంగా వినిపిస్తున్న మాట.
మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణం ప్రమాదం కాదని పోలీసులు అనుమాన పడుతున్నారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. కావాలనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారనే అనుమానం వచ్చేలా కొన్ని క్లూస్ పోలీసులకు చిక్కినట్టు సమాచారం.
మంచిర్యాల జిల్లా గుడిపల్లి వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్దరాత్రి జరిగిన ఈ సంఘట తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. తర్వాత కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అక్కడ పెట్రోల్ క్యాన్స్ దొరికినట్టు తెలిసింది. అదే టైంలో ఆటో కూడా అనుమానాస్పదంగా వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి కోసం అందర్నీ చంపేశారా!
ఈ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా... ఒకరు మాత్రం బయట వ్యక్తి. ఆయన పేరు శాంతయ్య. ఈయన కారణంగానే ఇంత దారుణం జరిగిందని స్థానికంగా వినిపిస్తున్న మాట. సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్న శాంతయ్యకు తన కుటుంబంతో విభేదాలు ఉన్నాయట. కొన్ని రోజులుగా ఆయన ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇంట్లోనే ఉంటున్నారని సమాచారం.
ఈ విభేదాల కారణంగానే శాంతయ్య ఫ్యామిలీ మెంబర్స్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఖాకీలు.... వారిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.