Palnadu Crime : నడిరోడ్డుపై హత్యతో వినుకొండలో 144 సెక్షన్- వ్యక్తిగత కక్షగా పోలీసుల నిర్దారణ
Vinukonda Murder: వినుకొండలో యువకుడి హత్య రాజకీయరంగు పులుముకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపించగా, వ్యక్తిగత కక్షలే కారణమని టీడీపీ విమర్శించింది
Andhra Pradesh Crime: వినుకొండ(Vinukonda) హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. రషీద్ అనే వ్యక్తిని జిలానీ నడిరోడ్డుపై కత్తితో నరికి చంపారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని పోలీసుశాఖ పట్టణంలో 144 సెక్షన్ విధించింది. దీనికి మీరు కారణమంటే మీరే కారణమంటూ టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం మొదలైంది.
నడిరోడ్డుపై హత్య
వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రషీద్(Rashidh) అనే యువకుడిని జిలానీ(Jilani) కొబ్బరి బోండాలు నరికే కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య కలకలం రేపింది. పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అయినప్పటికీ...మొహర్రం రోజు హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం పట్టణంలో 144 సెక్షన్ విధించారు.
మాటల యుద్ధం
రషీద్ హత్య ఘటన నేపథ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హత్యకు గురైన రషీద్ వైసీపీ(YCP) యువజన విభాగం నాయకుడిగా ఆ పార్టీ ప్రకటించింది. జిలానీ తెలుగుదేశం(TDP) సానుభూతిపరుడిగా పేర్కొంటూ విమర్శల దాడికి దిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హత్యా రాజకీయాలకు తెరలేపారంటూ విమర్శించింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో నరికి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యం వైసీపీ వర్గీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు(Law and order) క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతల అండ చూసుకునే జిలానీ ఈ హత్యకు పాల్పడ్డాడని వారు విమర్శించారు. వైసీపీ ఆరోపణలు తెలుగుదేశం నేతలు తిప్పికొట్టారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలకు రాజకీయరంగు పులమొద్దని హితవు పలికారు.
గతంలో జిలానీపై రషీద్ దాడి చేసి తీవ్రంగా కొట్టాడని...అందుకే ఇప్పుడు ఈ హత్య జరిగిందని వివరించారు. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న టీడీపీ నేతలు...ఈ వివాదం మరింత పెరగకుండా పోలీసులు(Police) 144 సెక్షన్ అమలు చేసి కట్టడి చేశారని గుర్తుచేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారని తెలిపారు. వైసీపీ నేతలు ప్రజలలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని..శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ హత్యను వ్యక్తిగత కారణాలతోనే చూడాలి తప్ప..రాజకీయ, సామాజికవర్గ అంశాలకు ముడిపెట్టవద్దన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వరుస హత్యలు, బెదిరింపులపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని వైసీపీ నేతలు చెప్పారు. రషీద్ హత్య ఘటన వీడియోలను ఆపార్టీ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు.
పోలీసుల వివరణ
పాతకక్షలతోనే వినుకొండలో యువకుడి హత్య జరిగింది తప్ప..ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పోలీసులు తెలిపారు. గతంలో జిలానీపై రషీద్ చేయడం వల్లే తిరిగి ఇప్పుడు దాడి చేశాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ, హింసను ప్రేరేపించడంగానీ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
Also Read: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి