Andhra Pradesh: ఒక కాకిని కట్టేస్తే వందల కాకుల ధర్నా- నడిరోడ్డుపై వ్యక్తిని నరుకుతుంటే వీడియో తీసిన జనం- ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి?
Palnadu Crime News : కాకిలా కలకాలం బతకు అవసరం లేదని చాలా మంది అంటారు.ఇలాంటివి చూస్తే మాత్రం కాకిలాంటి బతుకే మంచిదనిపిస్తుంది. రెండు ఘటనలు ఐక్యతకు, అమానవీతయకు అద్దం పడుతున్నాయి.
Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుంది. చివరు ఏదోలా దాన్ని పట్టుకున్న చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు. కట్టేయడంతో కాకి మరింతగా అరవడం మొదలు పెట్టింది. అంతే వందల కాకులు వచ్చి వాలిపోయాయి. అరవడం మొదలెట్టాయి.
కాకులు ఎవర్నీ ఏం చేయలేదు. కాలు కింద పెట్టలేదు. కట్టేసిన కాకిని వదిలి పెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోల గోల చేశాయి. వాటి గోల స్థానిక ప్రజలు వాటి గోలను భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నది సాధించాయి. ఆ గోలతో చేసేదేమి లేక కట్టేసిన కాకిని చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు. అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి.
నడి రోడ్డుపై హత్య
అదే రోజు పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా మరో వ్యక్తి నరుకుతూ కనిపించాడు. అది కూడ ఆందరూ చూస్తుండగానే ఇద్దరూ గొడవ పడ్డారు. రాజకీయ గొడవలో, వ్యక్తిగత కక్ష ఏదైనా కానివ్వండి.. నడిరోడ్డుపై ఒక వ్యక్తిని మరో వ్యక్తి నరుకుతుండగా అటూ ఇటూ జనం తిరుగుతూనే ఉన్నారు. కానీ పట్టించుకున్న వారే లేరు.
వినుకొండ వైఎస్ఆర్సీపీ నేత రషీద్‌పై ప్రత్యర్థి జిలానీ హేయంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహతంగా నరికి చంపేశాడు. కత్తి చేసిన దాడిలో మొదట చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేశాడు. వదిలేయాలని ప్రాథేయపడ్డాడు. అసలు తనకేమీ పట్టనట్టు జిలానీ తన చేతిలో ఉన్న కత్తితో నరుకుతూనే ఉన్నాడు.
చుట్టపక్కల వారంతా ఆ దుర్ఘటనను చూస్తున్నారు. కానీ ధైర్యం చేసి జిలానీని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. చేతులు కాల్లు మెడ భాగంలో కత్తిగాట్లుతో తీవ్ర రక్త స్రావంలో కుప్పకూలిపోయాడు రషీద్. అతను పడిపోయాడని ధ్రువీకరించుకున్న జిలానీ ఆ తర్వాత గానీ అక్కడి నుంచి వెళ్లలేదు.
జిలానీ అలా వెళ్లిన వెంటనే స్థానికులు పరుగెత్తుకొని వెళ్లి రక్తస్రావంలో పడి ఉన్న రషీద్‌ను తట్టిలేపారు. అప్పటికే అతను తుదిశ్వాస విడిచిపెట్టేశాడు. ఆ తర్వాతే పోలీసులు కూడా వచ్చారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఎవరు ఎలాంటి వారైనప్పటికీ చంపుకొని కొట్టుకునే హక్కు ఎవరికీ లేదు.
కాకి దండయాత్ర- వేడుక చూసిన ప్రజలు
ఓ చోట కాకిని కట్టేసినందుకే వందల కాకులు వచ్చి శాంతియుత మార్గంలో ధర్నా చేశాయి. తన తోటి కాకిని విడిపించుకునే వరకు అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయాయి. మరో చోట తోటి మనిషిని నరుకుతుంటే వీడియో తీస్తున్న జనం ఏదోలా రక్షించాలనే ప్రయత్నం చేయలేదు. నోటితో వద్దు వద్దూ అనే మాట తప్ప వేరే ప్రయత్నం జరిగినట్టు కనిపించలేదు. వేడుక చూస్తున్నట్టు అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు సాగిన వాళ్లు కొందరైతే... ఏం జరుగుతుందో అని అక్కడే ఉండి ఎంజాయ్ చేసిన వాళ్లు మరికొందరు. ఇంత విజ్ఞానం సంపాదించి మానవుడు కనీసం కాకి పాటి సాయం చేయలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ మనుషులను కించపరిచే ఉద్దేశం లేదు. అయినా సెల్‌ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పక్కవాడు ఎలా పోతున్నా వీడియో తీస్తూనో రీల్స్ చేస్తూనో కాలం వెళ్లదీస్తున్నారు. ఇది మానవత్వానికి మాయని మచ్చలా మారుతున్నాయి.