Pune Car Crash: పుణె కారు ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ - నివేదిక మార్చేసిన ఇద్దరు వైద్యుల అరెస్ట్
Pune Porsche Accident: పుణె పోర్షే కారు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. వీరు నిందితుడి రక్త నమూనాలు మార్చేసినట్లు గుర్తించారు.
Two Doctors Arrested In Pune Car Crash Case: మహారాష్ట్రలోని పుణెలో (Pune) పోర్షే లగ్జరీ కారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో (Porshe Car Accident) బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిపై చర్యలు చేపట్టారు. సాసూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజేయ్ తావ్‌రే, డాక్టర్ శ్రీహరి హార్నూర్ ను పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ తావ్‌రే ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలుత మైనర్ రక్త నమూనాలను పరిశీలించి ఎలాంటి ఆల్కహాల్ లేవని నివేదిక ఇచ్చారు. అయితే, సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడు మిత్రులతో కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. రక్త పరీక్షల సమయంలో మైనర్ నమూనాలు పారేసి.. మరో వ్యక్తి నమూనాలను వైద్యులు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తున్న అధికారులు వీరిపై చర్యలు చేపట్టారు.
#WATCH | Pune car accident case | Pune Police Commissioner Amitesh Kumar says "Sections 120 (B), 467 Forgery and 201, 213, 214 Destruction of evidence have been added in this matter. We received the forensic report yesterday and it has been revealed that the sample collected at… pic.twitter.com/UdurvDuVyu
— ANI (@ANI) May 27, 2024
'అతనికి పూర్తి అవగాహన ఉంది'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 'నిందితుడైన మైనర్ కు తాను పార్టీ చేసుకుంటూ ఆల్కహాల్ తాగిన విషయం తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కారు నడిపితే రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ప్రమాదం అన్న విషయంపైనా అతనికి పూర్తి అవగాహన ఉంది.' అని సీపీ అమితేష్ కుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో మైనర్ 200 కి.మీల వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించినట్లు చెప్పారు. '12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత మైనర్ స్థానిక పబ్‌లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగేందుకు చట్టపరమైన అనుమతి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్ కు మద్యం ఇచ్చిన బార్ ఓనర్‌పై చర్యలు తీసుకుంటాం.' సీపీ పేర్కొన్నారు.
పుణెలోని కల్యాణి నగర్‌లో ఈ నెల 19న (ఆదివారం) తెల్లవారుజామున పోర్షే కార్ బీభత్సం సృష్టించింది. ఓ క్లబ్‌కి వెళ్లిన ఇద్దరి స్నేహితులు బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. పోర్షే కార్ మితిమీరిన వేగంగా వచ్చి వాళ్లని ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వేరే కార్‌పై పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా షాకైన స్థానికులు కారు నడుపుతున్న మైనర్ ను బయటకు లాగి.. రోడ్డుపై ఈడ్చుకుంటూ దారుణంగా కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనంతరం మైనర్‌కు జువెనైల్ కోర్టు కొన్ని గంటల్లోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని, మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని.. భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. అయితే, నిందితునికి బెయిల్‌పై విమర్శలు రావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ఆ తీర్పును సవరిస్తూ.. మైనర్‌ను అబ్జర్వేషన్ హోంకు పంపింది. ఇప్పటికే నిందితుడి తండ్రి, బార్ సిబ్బందిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.