Wayanad landslide Tragedy : వయనాడ్‌కు ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి ఎమ్మెల్యేల చేయూత, నెల వేతనం విరాళంగా ప్రకటన
Wayanad Destruction : ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో అల్లాడుతున్న వయనాడ్ కు కేరళలోని ప్రతిపక్ష యుడిఎఫ్ కూటమి ఎమ్మెల్యేలు చేయూతనందించేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని వెల్లడించారు.
Wayanad Landslide Tragedy : కేరళలో ప్రకృతి సృష్టించిన విలయం నుంచి వయనాడ్ మెల్లగా కోలుకుంటోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సహాయ బృందాలు పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్డు, రవాణా మార్గాలను మెరుగుపరిచే పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో అల్లాడుతున్న రాష్ట్రానికి అండగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ నిర్ణయించింది. విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన వయనాడ్‌ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నట్టు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి ఆదివారం ప్రకటించింది. ఇందుకోసం యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి(సీఎంఆర్‌డీఎఫ్)కు అందించాలని నిర్ణయించారు.
పునరావాస కార్యక్రమాల్లో యూడీఎఫ్
వయనాడ్ పునర్నిర్మాణానికి నెల వేతనాన్ని చెల్లించడంతోపాటు పునరావాస కార్యక్రమాల్లోనూ యూడీఎఫ్ పాల్గొంటుందుని కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ పేర్కొన్నారు. జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ వంద ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా యూడీఎఫ్ కూటమిలో ప్రధాన ప్రతిపక్షమైన ఐయూఎంఎల్ కూడా పునరావాస చర్యల్లో భాగస్వామి అయినట్టు వెల్లడించారు. వయనాడ్ పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వానికి అండగా ఉంటామని, తమదైన మేరకు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం కూడా వయనాడ్‌కు పూర్తిస్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఆర్థికంగా అండగా నిలవాలని యూడీఎఫ్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
మరోవైపు సీపీఎం సారథ్యంలోని అధికార ఎల్‌డీఎఫ్‌కు చెందిన ఎమ్మెల్యేలు కూడా వయనాడ్ పునర్నిర్మాణానికి సహాయాన్ని ప్రకటించారు. ఎల్‌డీఎఫ్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల వేతనాన్ని సీఎంఆర్‌డీఎఫ్‌కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రమేశ్ చెన్నితల ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై కేపీసీసీ చీఫ్ కె సుధాకరన్ అసంతృప్తి వ్యక్తం చేవారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం నిర్వహించే నిధికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్‌డీఎఫ్‌కు విరాళాలు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ పార్టీలో స్వల్ప అలజడి చెలరేగిన నేపథ్యంలో యూడీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
219 మృతదేహాలు వెలికితీత.. 143 శరీర భాగాలు రికవరీ
ప్రకృతి సృష్టించిన విలయతాండవంతో అల్లాడిన వయనాడ్‌లో ఇప్పటికీ భీతావహ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలతో శనివారం రాత్రి వరకు 129 మృతదేహాలను, 143 శరీర భాగాలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. మరో 206 మంది ఆచూకీ లభించలేదన్నారు. మరోవైపు వయనాడ్ బాధితులకు సాయం అందించేందుకు దేశ వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.