Ananthapuram News: అనంత జిల్లాలో దారుణం - బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలుగా నరికేశారు
Andhrapradesh News: అనంతపురం జిల్లాలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనం కలిగించింది. ఇచ్చిన బంగారం తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలిని కొందరు గొడ్డలితో నరికి చంపారు.
Old Woman Brutal Murder in Ananthapuram: అనంతపురం (Ananthapuram) జిల్లాలో దారుణం జరిగింది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని కొందరు ముక్కలుగా నరికేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్లదిన్నె (Garladinne) మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఓబులమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగానే నివసిస్తోంది. ఆమె కుమార్తె హైదరాబాద్ లో స్థిరపడింది. అయితే, ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం ఓబులమ్మ 7 తులాల బంగారం ఇచ్చింది. వేడుక పూర్తై 15 రోజులు గడిచినా.. వారు బంగారం తిరిగివ్వలేదు. దీంతో వృద్ధురాలు స్థానికుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం ఓబులమ్మతో ఘర్షణకు దిగి.. గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చారు. శరీర భాగాలను ముక్కలుగా నరికి పెనకచర్ల డ్యామ్ లో పడేశారు. వృద్ధురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంత రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ భాషాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని డ్యామ్ నుంచి వెలికితీశారు.