Gannavaram News: వైసీపీ ఫ్లెక్సీలు ఫోటోలు తీసిన టీడీపీ మహిళా అభ్యర్థి - దాడికి యత్నం, గన్నవరంలో ఉద్రిక్తత
Vijayawada News: గన్నవరంలో వైసీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మహిళా అభ్యర్థి ఫోటో తీస్తుండగా.. వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొనగా.. పోలీసులు రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
Tension In Gannavaram Due to Flexis Issue: ఫ్లెక్సీల వివాదం గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి (Madhavi) శనివారం టీడీపీ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు విజయవాడకు (Vijayawada) చేరుకున్నారు. ఈ క్రమంలో కారులో వస్తుండగా.. గన్నవరంలో (Gannavaram) వైసీపీ ఫ్లెక్సీలు గమనించి ఫోటోలు తీశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఆమె 'సీ విజిల్' యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే, ఆమె ఫోటోలు తీయడం గమనించిన వంశీ వర్గీయులు మాధవిని అడ్డుకున్నారు. ఆమె కారును కదలనీయకుండా వారి వాహనాలను అడ్డుపెట్టారు. తనపై దాడికి యత్నించారని మాధవి ఆరోపించారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా.. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నాయి. టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని మాధవికి మద్దతుగా నిలిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సద్దిచెప్పి పంపించేశారు.
ప్రత్యేక వర్క్ షాప్
మరోవైపు, టీడీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న (శనివారం) విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్ షాప్‌నకు పిలిచారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్ షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.
కాగా, ఇటీవల రాజకీయ పార్టీల ప్రచార వ్యూహం మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలన్నీ ఎక్కువగా సోషల్ మీడియానే సాధనంగా తమ ప్రచారానికి వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థులు ఒక్కొక్కరు నలుగురు మేనేజర్లను నియమించుకోవాలని అధిష్టానం సూచించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని.. వారి ద్వారా నిరంతరం పార్టీ కార్యాలయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వారికి ఈ వర్క్ షాప్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.