Nellore News: ఎంపీడీవో వంకర బుద్ది- చితకబాదిన మహిళ!
Nellore News: మహిళా సెక్రటరీపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. ఓ మహిళ ఎంపీడీఓను చితకబాదింది. ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మరీ ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసింది.
Nellore News: ఆయనో ఎంపీడీఓ.. మండల స్థాయి అధికారి. సచివాలయాలు ఏర్పాటైన తర్వాత అతడిగి ఎమ్మార్వో స్థాయిలో పలుకుబడి పెరిగింది. మండల స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది కూడా ఆయన అజమాయిషీలోనే ఉంటారు. అలాంటి ఎంపీడీఓ.. ఓ మహిళా పంచాయతీ సెక్రటరీని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు, ఆ విషయంలో మహిళా సెక్రటరీకి మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన ఓ మహిళ ఎంపీడీవోని చొక్కా పట్టకుని సీట్లోనుంచి ఈడ్చుకొచ్చింది. చాచి కొట్టింది. నీకు పెళ్లాం లేదా.. మహిళా సెక్రటరీ అంటే అంత అలుసా అంటూ నిలదీసింది. ఈ ఘటనతో ఎంపీడీవో రఫీ ఖాన్ షాకయ్యారు. ఆయనతోటి సిబ్బంది కూడా మహిళ దాడి ఘటనతో అవాక్కయ్యారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదే జిల్లాలో మొన్నటికి మొన్న బాలికపై యాసిడ్ దాడి..
వెంకటాచలం మండలం చెముడుగుంటలోని ఓ కాలనీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. బాలిక తండ్రి ఆ సమయంలో ఇంట్లో లేరు. తల్లి కూడా పనిపై బయటకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి ఇదే అదునుగా భావించాడు మేనమామ నాగరాజు. మేనమామ అత్యాచారానికి ప్రయత్నించడంతో వారించిన బాలిక బాత్రూమ్ లోకి పరుగులు తీసింది. చివరకు బాత్రూమ్ లో ఆమెను బంధించిన నాగరాజు.. అక్కడి యాసిడ్ తీసి ఆమెపై పోశాడు. కత్తితో గొంతు కోసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కొనఊపిరిలో ఉన్న బాలికను తల్లిదంద్రులు నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నాడు.
కొన్నాళ్లుగా వేధింపులు..
మేనమామ నాగరాజు కొన్నాళ్లుగా బాలికను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేధింపులు తట్టుకోలేక కొన్నాళ్లు మాట్లాడడంలేదు. కానీ అతడు వదల్లేదు. అదునుకోసం వేచి చూశాడు. చివరకు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను బలాత్కరించబోయాడు. మాట వినకపోయే సరికి హతమార్చాలనుకున్నాడు. యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. గొంతు కోసి ప్రాణం తీయాలని సైతం చూశాడు.
గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. మరోవైపు ఆమె ముఖం అంతా కాలిపోయింది. అలాంటి స్థితిలో కూడా మేనమామ నాగరాజుని వదిలిపెట్టొద్దని పోలీసులను వేడుకుంది బాలిక. దీన్ని బట్టి చూస్తే వాడు ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిషితను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖంపై యాసిడ్ పోయడంతో చర్మం మొత్తం కాలిపోయింది. గొంతు కోయడంతో ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.