భార్య ప్రియుడిని హత్య చేసిన భర్త- ప్రమాదంగా చిత్రీకరించబోయాడు కానీ!
భార్య వివాహేతర సంబంధం తెలుసుకుని, ఆమె ప్రియుడ్ని ఓ పథకం ప్రకారం హత్య చేశాడు భర్త. అయితే దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలో అతను పోలీసులకు దొరికిపోయాడు.
వివాహేతర సంబంధం మైకంలో కట్టుకున్న భర్తల్ని కడతేరుస్తున్న భార్యల్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఓ భర్త, భార్య వివాహేతర సంబంధం తెలుసుకుని, ఆమె ప్రియుడ్ని ఓ పథకం ప్రకారం హత్య చేశాడు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలో అతను పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగినా, హంతకుడు, బాధితుడు అందరూ నంద్యాల జిల్లాకు చెందినవారు.
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు వద్ద మూడు రోజుల క్రితం ఓ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి లారీ కిందపడి మృతి చెందాడు. అతడి మృతదేహం ఛిద్రం కావడంతో వివరాలు తెలియలేదు. అయితే ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. అది ప్రమాదం కాదు, హత్య అని తేలింది.
అసలేం జరిగిందంటే..?
నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లకు చెందిన అశోక్, ప్రసాద్ స్నేహితులు. ప్రసాద్ భార్యతో అశోక్ కి అక్రమ సమబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా వారి స్నేహం చెడిపోయింది. ప్రసాద్, అశోక్ మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. కానీ ఆ తర్వాత ప్రసాద్ మెల్లగా ఓ పథకం పన్నాడు. మంచిగా ఉన్నట్టు నటించి అశోక్ ని అంతమొందించాలనుకున్నాడు. అశోక్ తో స్నేహం నటించాడు. చివరకు ఇద్దరూ కలసి నెల్లూరు జిల్లాకు పని కోసం వచ్చారు. నాపరాళ్ల లోడుతో నెల్లూరు జిల్లాకు వచ్చారు.
నంద్యాల జిల్లా నుంచి నాపరాళ్ల లోడుతో లారీ బయలుదేరింది. కలువాయిలో ఆ రాళ్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దారిలో లారీ ఆపి అశోక్, ప్రసాద్ మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరూ లారీపైకి ఎక్కి పడుకున్నారు. అయితే ప్రసాద్ వ్యూహం ప్రకారం మద్యం తాగకుండా నిద్ర నటించారు. అశోక్ బాగా నిద్రలోకి జారుకున్న తర్వాత అతడిని తలపై నాపరాళ్లతో కొట్టి చంపాడు. అశోక్ చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత లారీ కదులుతుండగానే అతడిని రోడ్డుపై వదిలేశాడు. వెనక లారీ వస్తుండటం చూసి సరిగ్గా లారీ కింద పడేట్లు శవాన్ని తోసేశాడు. ఆ లారీకింద పడి అశోక్ శరీరం నుజ్జునుజ్జయింది.
మొదట రోడ్డు ప్రమాదంగా అనుమానించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత తమతోపాటు పనికి వచ్చిన వ్యక్తి కనిపించడంలేదంటూ లారీతోపాటు వచ్చినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాద్ వ్యవహారం అనుమానంగా ఉండటంతో అతడిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. చివరకు ప్రసాద్ నిజం ఒప్పుకున్నాడు. తన భార్యతో అశోక్ కి అక్రమ సంబంధం ఉందని, అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. అశోక్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ ని అరెస్ట్ చేశారు.
హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని చూసినా చివరకు ప్రసాద్ పోలీసులకు దొరికాడు. అశోక్ కుటుంబ సభ్యులు మాత్రం అన్యాయంగా చంపేశారంటూ వాపోయారు. అశోక్ కి ఎవరితో వివాహేతర సంబంధం లేదని, కేవలం అనుమానంతోనే ఈ హత్య చేశారని అంటున్నారు. పోలీసులు ప్రమాదం వెనక ఉన్న కోణాన్ని వెలికి తీయడంలో విజయవంతం అయ్యారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రసాద్ చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు అతను కటకటాలపాలయ్యాడు.