Nellore Police: నెల్లూరులో వెరైటీ ఛేజింగ్- కాల్వలో ఈత కొట్టిన నిందితుడు, పోలీసులకు చుక్కలు
టిప్పర్ డ్రైవర్ కాల్వలో దూకడం పోలీసులు గమనించారు. అతడిని చేజ్ చేశారు కానీ వారు కాల్వలో దిగే సాహసం చేయలేకపోయారు. చివరకు గజ ఈతగాళ్లను రప్పించారు. వారి సాయంతో టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.
నేరస్తుల్ని పట్టుకోడానికి పోలీసులు రోడ్లపై ఛేజింగ్ చేయడం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జరగడం చూస్తూనే ఉంటాం. పరిగెత్తడమే కాదు, వాహనాల్లో కూడా ఛేజింగ్ చేసి మరీ నేరస్తుల్ని పట్టుకుంటారు. ట్రైన్లు, హెలికాప్టర్లు, పెద్ద పెద్ద పడవల్లో ఛేజింగ్ లు సినిమాల్లో కామన్. నెల్లూరు జిల్లాలో కూడా ఇలాంటి ఓ వెరైటీ ఛేజింగ్ జరిగింది. యాక్సిడెంట్ చేసి పారిపోతున్న నిందితుడ్ని పట్టుకోడానికి కనిగిరి రిజర్వాయర్ కాల్వలో కిలోమీటర్ దూరం వరకు ఛేజింగ్ చేశారు. ముందు నేరస్తుడు, వెనక గజ ఈతగాళ్లు.. కిలోమీటర్ చేజింగ్ తర్వాత అలసిపోయి వారికి దొరికిపోయాడు, చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ చల్లా కృష్ణ మద్యం సేవించి డ్యూటీ ఎక్కాడు. పొదలకూరు మీదుగా వింజమూరుకు టిప్పర్ తో బయల్దేరాడు. మందుకొట్టి డ్యూటీ ఎక్కిన కృష్ణ.. తూగుతూ ఊగుతూ డ్రైవింగ్ మొదలు పెట్టాడు. పొదలకూరు మండలం అయ్యగారిపాలెం సమీపంలో ఓ బైకిస్ట్ ని ఢీకొట్టాడు. ఆ బైకిస్ట్ కి గాయాలయ్యాయి. లారీని పట్టుకుందామని అనుకుంటే డ్రైవర్ స్పీడ్ గా ముందుకు లాగించాడు.
తాటిపర్తి వద్ద రెండో యాక్సిడెంట్..
బైకిస్ట్ ని ఢీకొట్టిన తర్వాత తాటిపర్తి కలుజు సమీపంలో ఒక గేదెను, తాటిపర్తి బస్టాండులో ఒక ఆటోను టిప్పర్ తో ఢీకొట్టాడు కృష్ణ. అక్కడినుంచి మరింత స్పీడ్ పెంచాడు. బైకిస్ట్ తాలుకు వ్యక్తులు, గేదెను ఢీకొనడంతో ఆ రైతు, ఆటో డ్రైవర్.. ఇలా అందరూ ఆ టిప్పర్ ని చేజ్ చేసుకుంటూ ముందుకు కదిలారు. మందుమీదున్న టిప్పర్ డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. మధ్యలో అతడి వాలకం చూసి చాలామంది పోలీసులకు ఫోన్లు చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీస్ వ్యాన్ కూడా వెనక తరుముకుంటూ వస్తుండే సరికి కృష్ణకు ఏం చేయాలో పాలుపోలేదు. చాలాదూరం మద్యం మత్తులోనే లారీని స్పీడ్ గా లాగించేశాడు. చివరకు సంగం వద్ద టిప్పర్ ని ఆపేశాడు. సంగం కనిగిరి రిజర్వాయర్ వద్ద టిప్పర్ ని రోడ్డు పక్కనే ఆపేసి కిందకు దూకాడు. వెనక వాహనాలు తరుముకుంటూ వస్తుండే సరికి వారి కళ్లుగప్పి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న పంట కాల్వలో దూకేశాడు.
పోలీసులు పసిగట్టారు..
టిప్పర్ డ్రైవర్ కాల్వలో దూకడం పోలీసులు గమనించారు. అతడిని చేజ్ చేశారు కానీ వారు కాల్వలో దిగే సాహసం చేయలేకపోయారు. చివరకు గజ ఈతగాళ్లను రప్పించారు. వారి సాయంతో టిప్పర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కిలోమీటర్ దూరం కాల్వలో ఈదుకుంటూ వెళ్లిపోయిన కృష్ణ.. పోలీసులను తప్పించుకున పారిపోవాలని చూశాడు. కాల్వలోనుంచి బయటకు రాకుండా లోపలే ఉండిపోయాడు. కానీ గజ ఈతగాళ్లు రావడంతో చివరకు వారికి చిక్కాడు.
మద్యం మత్తులో కూడా డ్రైవర్ కృష్ణ కాల్వలో ఈదుకుంటూ వెళ్తుండే సరికి పోలీసులు కంగారు పడ్డారు. అతడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళనకు గురయ్యారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి టిప్పర్ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.