Tea Shop Attack : సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వలేదని టీ షాపు యజమానిపై దాడి
Tea Shop Attack : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావలిలో రోడ్డు పక్కన టీ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై స్థానికులు తీవ్రంగా దాడి చేశారు.
Tea Shop Attack : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావలిలో రోడ్డు పక్కన టీ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కావలి స్థానికులు ఇద్దరు తీవ్రంగా దాడి చేశారు. టీ బంకులో రచ్చ రచ్చ చేశారు. అతడిని బూతులు తిడుతూ చేత్తే, కాలుతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది?
కావలి రహదారి పక్కనే ఉన్న టీ షాపు ముందు బైక్ లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగారు. బైక్ దిగకుండానే టీ, సిగరెట్ తమ దగ్గరకు తెచ్చివ్వాలని అడిగారు. దీనికి టీ షాపు యజమాని అభ్యంతరం తెలిపాడు. లోపలకు వచ్చి తాగాలని, దగ్గరకు తెచ్చివ్వడం కుదరదని అన్నాడు. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తులిద్దరూ దిగి టీ షాపులోకి వచ్చారు. టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వనంటావా అంటూ తీవ్రంగా కొట్టారు. మా స్థాయి ఏంటి, మా సంగతేంటి అంటూ బూతులు తిట్టారు.
పాపం.. దెబ్బలు తిన్న టీ షాపు యజమాని
వారిద్దరూ అంత తీవ్రంగా కొడుతున్నా కూడా టీ షాపు యజమాని నోరు మెదపకపోవడం విశేషం. స్థానికుడు కాకపోవడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూశారు. కానీ వారు వినలేదు. టీ బంకు యజమాన్ని దాదాపు పది నిముషాలసేపు కొడుతూనే ఉన్నారు. పాపం పిల్లలు కలవాడు వదిలేయండి అంటూ చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నా కూడా మరింతగా రెచ్చిపోయి మరీకొట్టారు.
అరేయ్ అంటావా?
టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వనని చెప్పడంతోపాటు, అరేయ్ అంటావా అంటూ టీ బంకు యజమానిపై దాడికి దిగారు వారిద్దరు. అరేయ్ అనడానికి నీ స్థాయి ఎంత అంటూ తన్నారు. వీడియో తీస్తున్నారని తెలిసినా కూడా వారు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలోకి అప్లోడ్ అయింది. టీ షాపు యజమానిపై దాష్టీకం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. కేవలం టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వను అని చెప్పినందుకే ఇంతలా దాడి చేయాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాకే పరిమితం అయింది. దీనిపై ఎవరూ ఎలాంటి కేసు పెట్టకపోవడంతో పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించలేదని తెలుస్తోంది. వీడియో వైరల్ గా మారడంతో ప్రస్తుతం దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని అంటున్నారు. కావలి వాసులకు ఆ ఇద్దరూ ఎవరో తెలుసని చెబుతున్నారు.
సచివాలయ సిబ్బందిపై దాడి
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు నగరపాలక, సచివాలయ సిబ్బంది యత్నించారు. క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇంటి గోడను కూల్చేందుకు సచివాలయ సిబ్బంది ప్రొక్లైనర్ తో అక్కడికి వచ్చారు. గోడ కూల్చివేతపై న్యాయస్థానంలో స్టే ఉందని క్రాంతి కుమార్ సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే సిబ్బంది ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నించడంతో క్రాంతికుమార్, అతడి అనుచరులు సచివాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కూల్చేందుకు ప్రయత్నించారని ఇంటి యజమాని ఆరోపించారు
Also Read : Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి