Kadapa News : అక్రమ నిర్మాణాల తొలగింపులో ఉద్రిక్తత, సచివాలయ సిబ్బందిపై దాడి
Kadapa News : కడపలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఇంటి యజమానులు నగరపాలక, సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు.
Kadapa News : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లా కడపలో అక్రమ నిర్మాణాలు తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లిన నగరపాలక, సచివాలయ సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. రహదారి విస్తరణలో భాగంగా ఆక్రమణలను తొలగించేందుకు నగరపాలక, సచివాలయ సిబ్బంది యత్నించారు. క్రాంతికుమార్ అనే వ్యక్తి ఇంటి గోడను కూల్చేందుకు సచివాలయ సిబ్బంది ప్రొక్లైనర్ తో అక్కడికి వచ్చారు. గోడ కూల్చివేతపై న్యాయస్థానంలో స్టే ఉందని క్రాంతి కుమార్ సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే సిబ్బంది ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నించడంతో క్రాంతికుమార్, అతడి అనుచరులు సచివాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కూల్చేందుకు ప్రయత్నించారని ఇంటి యజమాని ఆరోపించారు.
కడపలో ఉద్రిక్తత
కడపలోని అక్రమ ఇళ్ల నిర్మాణం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవుని కడపకు వెళ్లే రోడ్డులో బుక్కాయిపల్లి వద్ద ఓ ఇంటిని అక్రమంగా నిర్మించారని రెవెన్యూ సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించింది. అయితే కూల్చివేతను ఇంటి యజమానులు అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిపై సచివాలయ సిబ్బంది టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య సాయి ప్రవచన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
నగరపాలక కమిషనర్ ఎంట్రీతో
బుక్కాయిపల్లిలో అక్రమ నిర్మాణం చేపట్టిన ఇంటి వద్దకు చేరుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ జేసీబీతో కూల్చి వేయించారు. తహశీల్దార్ శివరామరెడ్డి కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. అక్రమనిర్మాణంగా తేల్చిన ప్రాంతాన్ని మొత్తం అధికారులు జేసీబీతో కూల్చివేశారు. ఇంటిని కూడా కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా ఇంటి యజమానులు వేడుకోవడంతో రాత్రి వరకు సమయం ఇచ్చారు. శుక్రవారం ఉదయంలోపు ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంటిని మొత్తం కూల్చివేస్తామని కమిషనర్ సూర్య సాయి ప్రవచన్ హెచ్చరించారు. తమ సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
టీ షాపు యజమానిపై దాడి
నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కావలిలో రోడ్డు పక్కన టీ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కావలి స్థానికులు ఇద్దరు తీవ్రంగా దాడి చేశారు. టీ బంకులో రచ్చ రచ్చ చేశారు. అతడిని బూతులు తిడుతూ చేత్తే, కాలుతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది?
కావలి రహదారి పక్కనే ఉన్న టీ షాపు ముందు బైక్ లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగారు. బైక్ దిగకుండానే టీ, సిగరెట్ తమ దగ్గరకు తెచ్చివ్వాలని అడిగారు. దీనికి టీ షాపు యజమాని అభ్యంతరం తెలిపాడు. లోపలకు వచ్చి తాగాలని, దగ్గరకు తెచ్చివ్వడం కుదరదని అన్నాడు. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తులిద్దరూ దిగి టీ షాపులోకి వచ్చారు. టీ, సిగరెట్ దగ్గరకు తెచ్చివ్వనంటావా అంటూ తీవ్రంగా కొట్టారు. మా స్థాయి ఏంటి, మా సంగతేంటి అంటూ బూతులు తిట్టారు.
పాపం.. దెబ్బలు తిన్న టీ షాపు యజమాని
వారిద్దరూ అంత తీవ్రంగా కొడుతున్నా కూడా టీ షాపు యజమాని నోరు మెదపకపోవడం విశేషం. స్థానికుడు కాకపోవడంతో అతను సైలెంట్ గా ఉన్నాడు. మధ్యలో చాలామంది ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూశారు. కానీ వారు వినలేదు. టీ బంకు యజమాన్ని దాదాపు పది నిముషాలసేపు కొడుతూనే ఉన్నారు. పాపం పిల్లలు కలవాడు వదిలేయండి అంటూ చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నా కూడా మరింతగా రెచ్చిపోయి మరీకొట్టారు.
Also Read : Prakasam Crime : ప్రకాశం జిల్లాలో దారుణం, భోజనం పెట్టలేదని భార్యను హత్యచేసిన భర్త!
Also Read : రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు