Nellore Woman Murder: నెల్లూరులో యువతిని రూమ్‌కు పిలిచి కత్తితో పొడిచి చంపేసిన ఫ్రెండ్ - అసలేం జరిగింది ?
Nellore: నెల్లూరులో దారుణ హత్య జరిగింది. మాట్లాడాలని గదికి పిలిచి బీఫార్మసీ విద్యార్థిని కత్తితో పొడిచి చంపాడు స్నేహితుడు నిఖిల్.

Nellore B Pharmacy student Murder: నెల్లూరు లో మైథిలిప్రియ అనే బీఫార్మసీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థిని దారుణ హత్యకు గురయింది. ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి చంపాడు. కరెంట్ ఆఫీస్ సెంటర్‌లోని అతని గదిలో ఈ ఘటన జరిగింది. మాట్లాడాలని ఆమెను పిలిచి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత నిందితుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
మైథిలి ప్రియతో నిఖిల్ స్నేహంగా ఉండేవాడు. మాట్లాడేందుకు రావాలని పిలవడంతో ఆమె అతని గదికి వెళ్లింది. లోప ఏం జరిగిందో కానీ కాసేపటి తర్వాత మేథిలిని ఇష్టం వచ్చినట్లుగా కత్తితో పొడిచి చంపాడు. ఆ గది నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేటప్పటికే ఆమె చనిపోయింది. నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మైథిలి ప్రియ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
హత్యకు ముఖ్య కారణం ప్రేమోన్మాదమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిల్ ప్రేమ వ్యక్తం చేసినప్పుడు మైథిలి ప్రియ తిరస్కరించడంతో అతని ఆగ్రహం పెరిగి, ఈ దారుణ హత్యకు దారితీసిందని అనుమానించారు. ఇద్దరూ కొంతకాలంగా స్నేహితులుగా ఉండేవారని, కానీ నిఖిల్ దాన్ని ప్రేమ అనుకున్నాడని భావిస్తున్నారు. చివరికి ప్రేమను తిరస్కరించడంతో కోపంతో హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మైథిలి ప్రియ మొదటి నుంచి నిఖిల్‌తో దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
"నిఖిల్‌పై హత్యా కేసు నమోదు చేశాము. అతను లొంగిపోయినా, పూర్తి విచారణ జరుపుతాము. ఫోరెన్సిక్ టీమ్ ఘటనాస్థలం నుంచి సాక్ష్యాలు సేకరిస్తోంది. ఇలాంటి కేసుల్లో మహిళల సురక్షితం పెంచే చర్యలు తీసుకుంటాము" అని పోలీసులు ప్రకటించారు. మైథిలి ప్రియ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాలేజీ రోజుల్లో ప్రేమలు, తిరస్కారానికి గురైనప్పుడు ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. సినిమాలు, ఓటీటీల ప్రభావంలో ఇలా హత్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.





















