ATM Thieves Nellore: ఈ ఏటీఎం గజ దొంగలు డబ్బులు మాత్రం కొట్టేయరు, మరేం చేస్తారో చూడండి
Nellore నగర పరిధిలో ఇటీవల పలు చోట్ల ఏటీఎంలో దొంగలు పడినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. నగదు పోయిందా, ఏటీఎం మిషన్ ని పగలగొట్టారా అంటే ఫిర్యాదు చేసినవారినుంచి సమాధానం ఉండదు.
ఏటీఎంలో దొంగలు పడ్డారు, కానీ ఏటీఎం మెషిన్ ని పగలగొట్టడం వారి వల్ల కాలేదు. అనే వార్తలు మనం చాలా చోట్ల వినే ఉంటాం. ఆ తర్వాత దొంగలు తెలివి మీరారు ఏకంగా ఏటీఎం మెషిన్లనే ఎత్తుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో ఓ దొంగల ముఠా ఇంకాస్త తెలివి మీరింది. ఏటీఎంలను వీరు టార్గెట్ చేసినా వీరి అసలు టార్గెట్ మాత్రం డబ్బులు కాదు.. మరింకేంటో తెలుసా.
నెల్లూరు నగర పరిధిలో ఇటీవల పలు చోట్ల ఏటీఎంలో దొంగలు పడినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. నగదు పోయిందా, ఏటీఎం మిషన్ ని పగలగొట్టారా అంటే ఫిర్యాదు చేసినవారి నుంచి సమాధానం ఉండదు. కానీ అన్ని చోట్లా కామన్ గా బ్యాటరీలు మాయం అయ్యేవి. అవును, ఆ దొంగల ముఠా ఏటీఎంలను టార్గెట్ చేసేది కేవలం బ్యాటరీల కోసమే.
తిరుపతి సిటీ అరుణోదయ నగర్ కి చెందిన ఆదినారాయణ, భవానీ నగర్ కి చెందిన ఈశ్వర్.. మరో ఇద్దరు మైనర్ బాలుర సాయంతో ఏటీఎంలను దోచుకునే ప్లాన్ వేశారు. అయితే నగదు దొంగతనం చేయడం అంత ఈజీ కాదని వీరికి తెలుసు. అందుకే తేలిగ్గా దొరికే బ్యాటరీలపై కన్నేశారు. ఏటీఎం మెషన్లు రన్ కావాలన్నా, ఆ ప్రాంతంలో కరెంటు పోయినా ఏటీఎం మెషన్ నడవాలన్నా ఇన్వర్టర్ బ్యాటరీలు అత్యవసరం. అందుకే ప్రతి ఏటీఎంలోనూ ఇన్వర్టర్ బ్యాటరీలు ఉంటాయి. వీటిని సులభంగా తస్కరించడం అలవాటు చేసుకున్నారు ఈ ముఠా సభ్యులు. సెక్యూరిటీ తక్కువగా ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసుకుని వీరు తమ పని కానిచ్చేసేవారు.
సహజంగా నగర శివార్లలో ఉండే ఏటీఎంలలో నగదు లభ్యత తక్కువగా ఉంటుంది. అలాంటి ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ కూడా ఉండదు. కానీ ఏటీఎం మిషన్ ఉంటే కచ్చితంగా బ్యాటీలు ఉంటాయి. దీంతో ఈ దొంగలు అలాంటి ప్రాంతాల్లో ఏటీఎంలను టార్గెట్ చేసుకుని బ్యాటరీలు దొంగిలించేవారు. మొత్తం 53 బ్యాటరీలను ఇలా ఏటీఎం సెంటర్ల నుంచి తీసుకొచ్చారు. వీటి విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసుల అంచనా. ఎట్టకేలకు ఈ బ్యాచ్ ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి తెలివి చూసి ఆశ్చర్యపోయారు. తిరుపతి, తడ వద్ద కూడా ఏటీఎం సెంటర్లు, సెల్ ఫోన్ టవర్ల వద్ద ఇలా బ్యాటరీలు దొంగిలించినట్టు నిందితులు పోలీసులల వద్ద తప్పు ఒప్పుకున్నారు.
ఏటీఎం దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెంచాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులు కనపడితే తక్షణం పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.