NCW: మియాపూర్‌లో యువతిపై అత్యాచార ఘటన - జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం
Hyderabad News: హైదరాబాద్ మియాపూర్‌లో యువతిపై అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. విచారణ జరిపి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది.
NCW Serious On Miyapur Young Woman Incident: మియాపూర్‌లో (Miyapur) యువతిపై అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు డీజీపీ రవి గుప్తాకు రాసిన లేఖలో కీలక ఆదేశాలు జారీ జేసింది. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నిర్దేశించింది. బాధితురాలికి ఉచితంగా మెరుగైన వైద్య సహాయం అందించాలని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇదీ జరిగింది
మియాపూర్ ఠాణా పరిధిలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఉప్పల్‌లోని హాస్టల్‌లో ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో మియాపూర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని నమ్మించి జూన్ 30న మియాపూర్ రావాలని కోరారు. ఆ రోజు ఉదయం ఆమె మియాపూర్ రాగానే స్థానికంగా ఓ హాస్టల్‌లో చేర్చారు.
శిక్షణ పేరుతో నమ్మించి..
ఆ యువతికి స్థిరాస్తి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో శిక్షణ ఇప్పిస్తామంటూ నమ్మించారు. యాదగిరిగుట్ట సమీపంలోని వెంచర్‌లో శిక్షణ ఉందంటూ అదే రోజు మధ్యాహ్నం యువతిని కారులో తీసుకెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రాత్రి 9 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. కారు చెడిపోయిందని చెప్పి జన సంచారం లేని ప్రాంతంలో వాహనం నిలిపి యువతికి బలవంతంగా మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. తరువాత తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. జులై 1న అస్వస్థతకు గురైన యువతి.. 2న ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును మియాపూర్ బదిలీ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మియాపూర్ సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.