Sangareddy News: అన్నం తినిపించిన చేతులే ఆయువు తీశాయి - ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
Telangana News: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
Mother Poisoned Her Children And Died In Sangareddy: నవమాసాలు కనిపెంచిన ఆ తల్లే ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశమైంది. అన్నం తినిపించాల్సిన చేతులతోనే విషం ఇచ్చి ముగ్గురు చిన్నారుల ఆయువు తీసింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఈ విషాద ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) మండలం రుద్రారం గ్రామంలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ప్రాణం తీసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఇస్నాపూర్‌లో మెకానిక్ కాగా కొద్ది రోజులుగా అతను కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ కారణంగానే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు గ్రామంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
మరో ఘటన
అటు, హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు అనంతరం వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్ (40), వర్షిణి (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3)తో కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి తమ ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు అనంతరం వారూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి స్వస్థలం మంచిర్యాల కాగా.. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు ఇలా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉరి వేసుకునే ముందు వెంకటేశ్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మృతుని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: వరదలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, కాపాడలేకపోయానంటూ మంత్రి పొంగులేటి కన్నీళ్లు