Ponguleti Srinivas Reddy: వరదలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, కాపాడలేకపోయానంటూ మంత్రి పొంగులేటి కన్నీళ్లు
Telangana Rains | తన నియోజకవర్గం పాలేరులో ఓ కుటుంబం వరదలో కొట్టుకుపోవడంపై మాట్లాడుతూ.. వారిని కాపాడలేకపోయానంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
Ponguleti Srinivas Reddy emotional | హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన ఇటుకలపని చేసుకునే యాకూబ్ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన నియోజకవర్గమైన పాలేరులో ఓ కూలీ కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో మీడియాతో మాట్లాడుతూ లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో ఆ కుటుంబాన్ని దేవుడే కాపాడాలని భావోద్వేగానికి గురయ్యారు. ముగ్గురిలో ఒకరిని సిబ్బంది కాపాడింది. అయితే అన్ని ఉన్నా కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రాణాలు కాపాడలేకపోయాంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో భారీ వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదే సమయంలో యాకూబ్ కుటుంబం వరదలో కొట్టుకుపోయిన సమాచారం రావడంతో మాటరాని స్థితికి లోనయ్యారు. ఆ వెంటనే తేరుకుని ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఉదయం నుంచి తీసుకున్న చర్యలను వివరించారు.
వారిని కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు
“ ఆ కుటుంబాన్ని కాపాడేందుకు ఉదయం నుంచి చేయని ప్రయత్నం లేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు హకీంపేటలోని పలు హెలికాప్టర్ లను నాయకన్ గూడెంకు పంపేందుకు ఫోన్ ల మీద ఫోన్ లు చేశాను. కానీ భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్లు టేకాఫ్ కావడం కష్టమని తెలిసిందే. మరోవైపు యాకూబ్ తో పాటు ఆయన భార్య సైదాతో నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్పాం. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడికి పంపాం. వరద ఉధృతికి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్లలేకపోయాయి. కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి దగ్గరలోని ఊరు నుంచి ఒక డ్రోన్ కు ఒక తాడు కట్టి లైఫ్ జాకెట్లను వారికి స్థానికులు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు వారితో మాట్లాడాను. కానీ ఇంతలోనే వారు ఉన్న ఇంటిగోడ కూలి వరదలో కొట్టుకుపోయారు. అతికష్టం మీద వారి కొడుకు షరీఫ్ ను రక్షించగలిగాం” అంటూ జరిగిన ఘటనను వివరిస్తూ మంత్రీ కన్నీటి పర్యంతమయ్యారు.
రాష్ట్రంలో వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఎవరూ కూడా ఉండొద్దని, వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని మంత్రి పొంగులేటి సూచించారు. అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలు, వరద ముంచెత్తిన ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. దాంతో వరద నీరు ఇంకా ప్రవహించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.