తమ్ముడిని గొంతు కోసి చంపిన 15 ఏళ్ల బాలిక, ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో హత్య
Minor Girl Murder: తల్లిదండ్రులు తమ్ముడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఓ బాలిక దారుణంగా హత్య చేసింది.
Minor Girl Strangles Brother:
హరియాణాలో ఘటన..
హరియాణాలోని బల్లబగర్‌లో దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలిక 12 ఏళ్ల తన తమ్ముడిని కిరాతకంగా హత్య చేసింది. తల్లిదండ్రులు తన కన్నా తమ్ముడిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారన్న కోపంతో చంపేసింది. తల్లిదండ్రులిద్దరూ పని చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన సమయానికి కొడుకు నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. పడుకున్నాడేమో అనుకుని నిద్ర లేపేందుకు ప్రయత్నించారు. పైన బెడ్ షీట్‌ని తొలగించి చూశారు. గొంతుపై లోతైన గాయాన్ని చూసి షాక్ అయ్యారు. అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు తమ కూతురు తప్ప ఎవరూ ఇంట్లో లేరని చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ బాలికను ప్రశ్నించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని, తమ్ముడిపైనే వాళ్లకు ప్రేమ ఎక్కువగా ఉందని చెప్పింది. ఈ కోపంతోనే తమ్ముడిని చంపేసినట్టు అంగీకరించింది. ఈ ఇద్దరు పిల్లలూ యూపీలోని నాయనమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఎండాకాలం సెలవులు రావడం వల్ల ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగానే చూసినా...కూతురు మాత్రం కక్ష పెంచుకుంది. ఈ కేసుకి సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
"తల్లిదండ్రులు అబ్బాయికి ఫోన్ ఇచ్చారు. రోజంతా ఆ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. ఫోన్ ఇవ్వమని ఎంత అడిగినా ఇవ్వలేదు. దీంతో తమ్ముడిపై అక్క కోపం పెంచుకుంది. గొంతు కోసి చంపేసింది"
- పోలీసులు
కుటుంబ సభ్యులపైనే కాల్పులు
అమెరికాలోని టెక్సాస్‌లో 18 ఏళ్ల కుర్రాడు సొంత కుటుంబ సభ్యుల్నే కాల్చి చంపేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే "వాళ్లందరూ నన్ను తినేస్తారేమో అని భయం వేసింది. అందుకే చంపేశాను" అని సమాధానం చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. నిందితుడు సిజర్ ఒలాల్డ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు,ఇద్దరు తోబుట్టువులనూ చంపేశాడు. వారిలో ఓ 5 ఏళ్ల చిన్నారి ఉన్నాడు. గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి వద్దకు చేరుకునే లోపే...నిందితుడు లోపల ఉన్నాడు. ఇంట్లోని మిగతా వాళ్లు శవాలై పడి ఉన్నారు. తన వద్ద తుపాకీ ఉందని, జస్ట్ ట్రిగ్గర్ చేసి అందరినీ కాల్చి పారేశానని చాలా సింపుల్‌గా సమాధానం చెబుతున్నాడు ఆ కుర్రాడు. చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా అతనిలో కనిపించకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాత్‌రూమ్‌లో ఇద్దరి మృతదేహాలను కనుగొన్న పోలీసులు...వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
"ఇంట్లో వాళ్లను పరుగులు పెట్టించి మరీ కాల్చి ఉంటాడని భావిస్తున్నాం. వారంతా చనిపోయారని నిర్ధరించుకున్నాక బాత్‌రూమ్‌లో పడేశాడు. ఇల్లంతా రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ మహిళ లోపలకు వెళ్లి అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ...ఆమెనీ చంపేస్తానని గన్ చూపించాడు. భయంతో ఆమె వెనక్కి వచ్చేసింది. ఇరుగు పొరుగు వాళ్లతో ఈ కుటుంబానికి ఎలాంటి గొడవలూ లేవు. అందరితోనూ సరదాగా మాట్లాడతారు"
- పోలీసులు
Also Read: Manipur Violence: మణిపూర్ అల్లర్లపై అమిత్‌షా కీలక ప్రకటన, విచారణకు స్పెషల్ కమిటీ