Virat Kohli Viral Video: సింహాచలం అప్పన్న సన్నిధిలో విరాట్ కోహ్లీ.. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న క్రికెటర్లు
Virat Kohli Visits Simhachalam Temple | టీమిండియా క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో కనిపించాడు. విశాఖపట్నంలో మోస్తరు టార్గెట్ కావడంతో విరాట్ సెంచరీ హాఫ్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి రెండు వన్డేల్లో శతకాల మోత మోగించడం తెలిసిందే. విశాఖలో జరిగిన మూడో వన్డేలో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు నెగ్గిన కోహ్లీ సింహాచలం దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నాడు.
ఆదివారం నాడు ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసియా కప్ టీమిండియా మాజీ మేనేజర్ పి. వెంకట రామ్ ప్రశాంత్, టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఏసిఎ ప్రతినిధి విష్ణు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వర్ రావు, పర్యవేక్షణ అధికారి కంచి మూర్తి వీరికి స్వాగతం పలికారు. ముందుగా విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం నాదస్వరాలతో, వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు క్రికెటర్లు, సిబ్బందికి వేదాశీర్వచనం అందించారు. సింహాచలం అప్పన్న దేవస్థానం తరఫున స్వామివారి శేష వస్త్రం అందజేసి సత్కరించారు. అలాగే స్వామి వారి ఫొటోల, ప్రసాదాలు అందజేశారు.
విరాట్ కోహ్లీ సింహాచలం దేవాలయానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తెల్లటి టీ-షర్ట్ ధరించి, చేతిలో దండతో కనిపించాడు. మరో వీడియోలో ఆలయ సంప్రదాయం ప్రకారం పూజలు, కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
సింహాచలం దేవాలయానికి విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్
విరాట్ కోహ్లీ, టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, మరికొందరు క్రికెట్ సంబంధిత సిబ్బంది సింహాచలం కొండలపై ఉన్న సింహాచలం దేవాలయానికి వెళ్లారు. ఇది 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం శ్రీ విష్ణువు "వరాహ నరసింహ" రూపంలో స్వామివారు కొలువై ఉంటారు. 'సింహాచల్' అనే పదానికి సింహం పర్వతం అని అర్థం. ఈ పర్వతం విష్ణువు నాల్గవ అవతారమైన లక్ష్మీ నరసింహుడి నివాసంగా చెబుతారు.
Virat kohli visited Varaha Lakshmi Narasimha temple, Simhachalam, before the match pic.twitter.com/sJmdkeEErL
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) December 7, 2025
విరాట్ కోహ్లీకి POTS అవార్డు
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. అతను మొదటి వన్డేలో చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. తొలి వన్డేలో 135 పరుగులు చేసిన కోహ్లీ రాయ్‌పూర్‌లో కూడా సెంచరీ సాధించాడు. 102 పరుగులతో రాణించినా అనుకూల ఫలితం రాలేదు. ఆ తర్వాత విశాఖలో నిర్ణయాత్మక మూడవ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించింది.
మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 45 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టి రాణించాడు. టార్గెట్ మరిన్ని పరుగులు ఉంటే, విరాట్ హ్యాట్రిక్ సెంచరీని కూడా పూర్తి చేసేవాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విరాట్ 3 మ్యాచ్‌ల్లో మొత్తం 302 పరుగులు చేయగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. 20 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లతో సచిన్ రికార్డును అధిగమించాడు. సచిన్ ఖాతాలో 19 ఉన్నాయి.





















