తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ - గంజాయి చాక్లెట్ల విక్రయిస్తున్న వ్యాపారులు
తల్లిదండ్రులు షాక్ ఇచ్చే న్యూస్. గంజాయి కలిపి చాకెట్లు విద్యార్థులకు విక్రయిస్తున్న ముఠా దొరికింది.
ఆ చాక్లెట్లు చాలా తీయగా ఉంటాయి. చాలా మత్తెక్కిస్తాయి. వాటి ఖరీదు కూడా పెద్దగా ఏమీ ఉండదు. కేవలం 20 రూపాయలతే ఆ చాక్లెట్లు లభిస్తాయి.
ఇలాంటి చాక్లెట్లు పదే పదే పిల్లలు అడుగుతున్నా, పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నా సందేహించాలంటున్నారు కర్ణాటక పోలీసులు.
మంగళూరులో పోలీసులు దుకాణాలపై రైడ్స్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 120 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు దుకాణాల్లోనే ఈ చాక్లెట్లు దొరికాయి. ఒక షాప్‌లో 35 కిలోలు, మరో షాపులో 85 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.
చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు షాప్ ఓనర్లను అరెస్టు చేశారు. అనంతరం వారిని జుడీష్యియల్ కస్టడీకి తరలించారు.
ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించిన చాకెట్లను పరీక్షించారు. చాక్లెట్‌లలో గంజాయి ఉన్నట్టు నివేదికలో తెలిసిందని మంగళూరు పోలీస్ కమిషనర్ కుల్దీప్ జైన్ తెలిపారు. చాక్లెట్లు ఉత్తర భారతదేశం నుంచి, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
షాపు యజమానిలో ఒకరిని మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరొకరిని మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాయచూర్‌లో ఇదే తరహాలో మందు కలిపిన చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు దుకాణదారులను అరెస్టు చేశారు. ఇది పెద్ద రాకెట్‌లో భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారిని అరెస్టు చేయడానికి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామన్నారు.
ఇలా గంజాయి కలిపిన చాక్లెట్ల విక్రయం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి పిల్లలు ఇలాంటి వాటికి బానిసలైతే, వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు చాలా కష్టంగా మారుతుందంటున్నారు. పిల్లలు ఏమి తింటున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.