Crime News: తెలంగాణలో విషాదాలు - భార్యను చంపి భర్త సూసైడ్, బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య
Telangana News: తెలంగాణలో ఆదివారం విషాదాలు చోటు చేసుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి భార్యను చంపి సూసైడ్ చేసుకోగా.. కొత్తగూడెం జిల్లాలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Crime News In Telangana: తెలంగాణలో ఆదివారం తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఓ వ్యక్తి భార్యను చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు, భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో దూస రాజేశం (54), భార్య లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. రాజేశంకు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గత ఆరు నెలల నుంచి భర్తకు ఉపాధి లేకపోవడంతో దంపతుల మధ్య ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం భార్య లక్ష్మిని రాజేశం పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు.
ఉరి వేసుకుని సూసైడ్
అనంతరం, గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వచ్చిన కుమారుడు స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
వృద్ధ దంపతుల సూసైడ్
అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని పగిడేరు గ్రామానికి చెందిన కాసరబాద రామచంద్రయ్య (80), అతని భార్య సరోజనమ్మ (75)లు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరి కుమారులు అదే మండలంలోని గొల్లకొత్తూరు గ్రామంలో నివసిస్తున్నారు. వృద్ధ దంపతులు విడిగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధ దంపతులు తిరిగిరాలేదు. రాత్రైనా వీరి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెతకగా వ్యవసాయ బావి వద్ద వీరిద్దరి చెప్పులు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. బావిలో వెతకగా సరోజనమ్మ మృతదేహం లభ్యమైంది. రామచంద్రయ్య మృతదేహం కోసం ఈతగాళ్లతో గాలిస్తున్నారు. సరోజనమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
మరిన్ని ఘటనలు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం హుసెల్లి వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్ - బీదర్ రహదారిపై కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్ సహా.. మరో మహిళ మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అటు, పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన శనిగరం సాత్విక్ (13) కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలునికి వైద్యం చేస్తుండగా.. ఫిట్స్ రావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. మార్గమధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.