Crime News: బాపట్ల జిల్లాలో దారుణం - వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన కుమారుడు
Bapatla News: బాపట్ల జిల్లా అప్పికట్లలో దారుణం జరిగింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో వృద్ధ దంపతులను కుమారుడే కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
Son Murdered His Old Couple In Bapatla: బాపట్ల జిల్లాలో (Bapatla District) దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల మండలం అప్పికట్లలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. గ్రామంలో స్కూల్ హెచ్ఎంగా పని చేసి పదవీ విరమణ పొందిన పి.విజయ భాస్కరరావు (74), వెంకటసాయి కుమారి దంపతులు సొంతంగా గృహం నిర్మించుకుని ఉంటున్నారు. వీరికి కిరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతను పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. కిరణ్ 4 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన కిరణ్.. శనివారం తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న తల్లిదండ్రులను రోకలిబండతో కొట్టి దారుణంగా హతమార్చాడు. కేకలు విన్న స్థానికులు వెంటనే ఇంటి వద్దకు చేరుకుని నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. డీఎస్పీతో పాటు బాపట్ల ఎస్సై తదితరులు గ్రామంలో విచారించారు. కిరణ్‌కు మతిస్థిమితం పని చేయక సైకోలా ప్రవర్తిస్తాడని గ్రామస్థులు చెబుతున్నారు.