ATM: ఏటీఎంకు వెళ్లి కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి - వరద నీటిలో తేలియాడిన మృతదేహం, వైరల్ వీడియో
Chennai Rains: భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటీఎంకు వెళ్లిన ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అతని మృతదేహం నీటిలో తేలియాడిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Man Electrocuted At Flooded ATM In Chennai: 'ఫెంగల్' తుపాను (Fengal Cyclone) ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై సహా పలు ప్రాంతాలు జలమయం కాగా.. జన జీవనం స్తంభించింది. తాజాగా, చెన్నైలో (Chennai) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఏటీఎంకు (ATM) వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహం నీటిలో తేలియాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే అందులో వరద నీరు చేరి ఉండడంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వర్షపు నీటి తాకిడి ఎక్కువగా ఉండడంతో అతని మృతదేహం నీటిలో తేలియాడుతూ ఏటీఎం బయటకు కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు.
நிலைமை ரொம்ப மோசமாக உள்ளது..
— Dinesh (@imdineshadmk) November 30, 2024
மக்களே வெளியே செல்லும் போது மிக கவனம்.
மண்ணடி - ATMயில் பணம் எடுக்க சென்ற வடமாநிலத்தை சேர்ந்த வாலிபர் (சந்தன்) மின்சாரம் தாக்கி பலியானார்.#chennairain #FengalCyclone #4000கோடி_என்னாச்சு pic.twitter.com/TX7qxHKpab
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ షాక్ వల్లే అతను మృతి చెంది ఉంటాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోన్న 'ఫెంగల్' తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం నాటికి తుపాను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 7 గంటల వరకూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాను తీరం దాటేటప్పుడు ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.