Multilevel Scheme Case: మోకిలలో పిల్లల్ని చంపి, తండ్రి ఆత్మహత్య కేసు - ప్రధాన నిందితుడు అరెస్ట్
Telangana News: మల్టీ లెవెల్ స్కీమ్‌లో చేరి చివరికి అప్పులపాలై, వేధింపులు తట్టుకోలేక పిల్లల్ని చంపి, రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు తిరుపతిరావును పోలీసులు అరెస్ట్ చేశరాు.
Father With Three Children Lost Life: హైదరాబాద్: కుమారుల్ని చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో వ్యాపారి రవి మృతి కేసులో ప్రధాన నిందితుడ్ని మోకిల పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర శివారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో కమిషన్ కోసం వ్యక్తులను చేర్చి, చివరికి మోసపోయానని గ్రహించి రవి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.
ప్రధాన నిందితుడు తిరుపతిరావు అరెస్ట్
రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యాపారి రవి, అతడి కుమారుల మృతి కేసులో ప్రధాన నిందితుడు, జీఎస్ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిరుపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్ఎస్ ఫౌండేషన్ నుంచి తిరుపతిరావు ఆన్ లైన్ వేదికగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రారంభించాడు. రూ. 600 కట్టి స్కీమ్ లో చేరడంతో పాటు, మరో ఇద్దరిని చేర్చితే 10 శాతం కమీషన్ ఇస్తానని తిరుపతిరావు అందర్నీ నమ్మించాడు. మొదట రవి ఈ స్కీమ్ లో చేరాడు. ఆపై తనకు తెలిసిని చాలా మందిని ఈ స్కీమ్ లో చేర్పించాడు రవి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొందర్ని ఈ స్కీమ్ లో చేర్పించాడు రవి. వారి వద్ద నుంచి రవి సేకరించిన నగదు రూ.12 లక్షలను తిరుపతిరావుకు ట్రాన్స్ ఫర్ చేశాడు. మొదట్లో ఆఫర్ డబ్బులు ఇచ్చిన తిరుపతిరావు, ఆపై భారీగా వసూళ్లు రావడంతో రవికి కమీషన్ డబ్బులు ఇవ్వడం నిలిపివేశాడు.
తన వద్ద ఉన్న కొంత నగదుతో కొంతకాలం పాటు రవి.. తాను చేర్పించిన వారికి కమీషన్ నగదుగా ఇచ్చాడు. కానీ అసలు మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో అంతా రవిని ప్రశ్నించారు. స్కీమ్ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తున్నారంటూ కొందరు జర్నలిస్టులు రవిని వేధించారు. తమకు రూ.25 లక్షల మొత్తం ఇవ్వాలని సైతం బెదరించినట్లు రవి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో వేధింపులు భరించలేక రవి తన కుమారులను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి చంపేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. రవి మృతి కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించి దర్యాప్తు చేపట్టారు.