Madanpalle: లవ్ మ్యారేజ్ చేసుకున్న 3 నెలలకే పారిపోయిన భర్త, భార్య ఏం చేసిందంటే
స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది.
Madanpalle: ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు మూడు నెలలకే మొహం చాటేశాడు. దీంతో అతణ్ని నమ్మి వచ్చి వివాహం చేసుకున్న యువతి దిక్కులేని స్థితిలో నిరసనకు దిగింది. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనల్లెలో చోటు చేసుకుంది. తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన యువతి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్లి ధర్నాకు దిగింది. భర్త ఇంటి ముందు కూర్చొని రోధిస్తూ తన గోడును వెళ్లబోసుకుంది. ఇది చూసినవారంతా కన్నీరుపెట్టుకున్నారు.
బాధితురాలు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. తన అత్తింటి వారే అతణ్ని దాచి ఉంచారని చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన యువతి మహమ్మద్ సన గురువారం మదనపల్లె మండలం దిగువగాండ్ల పల్లెలోని తన భర్త ఇంటి ఎదుట కూర్చొని ఆందోళన చేస్తోంది.
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019లో తాను ఈ - సెట్ ట్రైనింగ్‌లో ఉండగా రమేష్ కుమార్ అనే యువకుడితో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారు ఇద్దరు స్నేహితులు అయ్యారు. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. ఈ ఏడాది జనవరి 4న మదనపల్లె మండలంలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, అత్తగారింట్లో అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయి. అత్తింటి వారు తనకు ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టేవారని బాధితురాలు వాపోయింది.
దీంతో ఇటీవల మదనపల్లె ఎస్టేట్‌లోని ఓ అద్దె ఇంటికి మారినట్లు పేర్కొంది. మూడు రోజుల క్రితం రమేష్ కుమార్ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అత్తింటివారిని అడిగితే తమకు ఏమీ తెలీదని చెప్పారు. మూడు రోజులైన రమేశ్ కనిపించకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. మతాలు వేరైనా వివాహం చేసుకోవడంతో అత్తింటి వారు తనను గృహ హింస పెట్టారని కన్నీటి పర్యంతం అయింది. రమేష్ కుమార్‌ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు తనను బెదిరించారని, ఇంకొందరు కొట్టారని గోడు వెళ్లబోసుకుంది. తాను వెళ్లనని పట్టుబట్టడంతో ఇలా చేశారని తన భర్త ఆచూకీ కనిపించకుండా చేశారని ఆరోపించింది.
దీంతో వెంటనే తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు సన కోరారు. అత్తింటి వారు మాట్లాడుతూ.. సన కుటుంబ సభ్యులే రమేష్ కుమార్‌ను ఏదైనా చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇరు వర్గాలు పరస్ఫరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.