Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
కర్నూలు కలెక్టర్ పీఏనని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో పలు ఫిర్యాదులు అందాయని పోలీసులు వెల్లడించారు.
కర్నూలు కలెక్టర్ పీఏనని చెప్పి కాంట్రాక్టర్లను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని కర్నూలు మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టర్ పీఏ అని బండి ఆత్మకూరు మండలం తాటికొండకు చెందిన పెద్ద మౌలాలి (39) అనే వ్యక్తి కాంట్రాక్టర్ యం.నవీన్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి, కాంట్రాక్టు బిల్లులు పాస్ కావాలంటే తనకు రూ.లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కర్నూలు త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న కర్నూలు 3వ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ తబ్రెజ్ దర్యాప్తు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో నిందితుడిని విలేకర్ల ముందు ఉంచి, వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 12వ తేదీన ఒక గుర్తు తెలియని వ్యక్తి నవీన్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తాను కర్నూలు కలెక్టర్ పీఏ అని పరిచయం చేసుకున్నాడు.
ఆ వ్యక్తి కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ.. నీ కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పాస్ చేయాలని ప్రభుత్వం నుండి ఆర్డర్స్ వచ్చినందున, అవి క్లియర్ చేయాలంటే 5 శాతం కమిషన్, రూ.లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి, పదే పదే ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని బెదిరించాలడని ఫిర్యాదు చేశారు.
అదే విధంగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇతరుల కాంట్రాక్టర్ ల నుండి కూడా ఈ నిందితుడిపై పలు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఇలా వచ్చిన ఫిర్యాదులతో తాడికొండ పెద్ద మౌలాలిపై క్రైం.నెం.09/2022 U/s 384, 419 r/w 34 IPC క్రింద కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా కర్నూలు పట్టణంలో నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
కాగా పెద్ద మౌలాలి తను చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు డీఎస్పీ మహేష్ మీడియాకు తెలిపారు. వాటితో పాటుగా నిందితుడు తాటికొండ పెద్ద మౌలాలి గతంలో చాలా నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2018లో బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్ లో నకిలీ పట్టాదారు పాసు బుక్ లు తయారు చేసి తహసీల్దార్, ఆర్డీవో, సబ్-రిజిస్టర్ సంతకాలు ఫోర్జరీ చేసినందుకు క్రైం.నెం. 99/2018 U/s 420, 468, 471 IPC కేసు నమోదు చేశారు.
2018 లో నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌లో ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తానని రూ.28 లక్షలు తీసుకొని మోసం చేసినందుకు, నకిలీ మున్సిపాలిటీ రశీదులు ఇచ్చినందుకు క్రైం.నెం.172/2018 U/s 420, 406 IPC కింద కేసు నమోదు చేశారు. అలాగే పత్తికొండ పోలీసు స్టేషన్ లో రాతన గ్రామానికి చెందిన ఉమామహేశ్వర రెడ్డి ఇచ్చిన ఫిర్యాది మేరకు క్రైం.నెం.11/2022 U/s. 419, 384 IPC క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గడివేముల పోలీసు స్టేషన్ లో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.6 లక్షలు వసూలు చేసినందుకు క్రైం.నెం.62/2021 U/s 420 IPC కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు.
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే