Kurnool News : కర్నూలు జిల్లాలో విషాదం, పిడుగుపాటుకు నలుగురు మృతి
Kurnool News : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు.
Kurnool News : కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం చెందారు. హోలగుంద మండలం వందవాగిలి గ్రామంలో పంట పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు చంద్ర, తాయప్ప అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఆదోని మండలం కుప్పగల్ లో పిడుగు పాటుకు మరో ఇద్దరు మహిళలు లక్షమ్మ, ఉరుకుందమ్మ మృతి చెందారు. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు రావడంతో చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు చెట్టుపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మృత్యువాత పడటంతో గ్రామాల్లో విషాదం నెలకొంది.
కోదాడ వద్ద ఘోర ప్రమాదం
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వస్తున్న టూవీలర్ ని వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మార్గంలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబులెన్స్ కి కాల్ చేసి, క్షతగాత్రులను హాస్పిటల్ కి పంపించారు. హైదరాబాద్ - విజయవాడ హై వేలో కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన స్థలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఉండి సేవలు అందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మేళ్ల చెరువు వెళుతున్న మంత్రి కళ్ల ముందే ఓ వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్పందించిన మంత్రి దయాకర్ రావు
హైదరాబాద్ వైపు వస్తున్న ఒక టూ వీలర్ ని వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 108 నెంబర్ కి ఫోన్ చేయించారు. స్థానిక ప్రజలతో కలిసి దగ్గరుండి క్షతగాత్రులను సమీప వైద్యశాలకు పంపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు
అక్కడకు చేరుకున్న పోలీసులతో కలిసి అక్కడే ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేయించారు. జరిగిన విషాద ఘటన పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో ఇద్దరు మృతి
బైక్ ను కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని గుడిబండ ఫ్లైఓవర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన బోయల శ్రీనివాస్, నాగమణి దంపతులు వారి ముగ్గురు పిల్లలతో ఒకే బైక్ పై చిలుకూరు మండలం సీతారామపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఫ్లైఓవర్‌పై నుంచి ఐదుగురు కింద పడిపోయారు. దీంతో శ్రీనివాస్(40) అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గంలో చిన్నకూతురు ఉషశ్రీ(7), ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగమణి(35) చనిపోయారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రగాయాలతో పరిస్థితి విషమంగా ఉంది.