Konaseema Crime News: ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రిని చంపాలని ప్లాన్, డామిట్.. కథ అడ్డం తిరిగింది..
Crime News | చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు కన్నతండ్రినే యాక్సిడెంట్ రూపంలో కడతేర్చి తండ్రి పేరున ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను క్లైమ్ చేసుకోవాలని చూశాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు..

అమలాపురం: ఆధునిక కాలంలో మానవత్వం మంట కలిసిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూ నడుస్తున్నాయి. దీనికి ఇటీవల కాలంలో జరుగుతోన్న వరుస సంఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న కొంతమంది యువత చివరకు కన్నవారినే హత్య చేసేందుకు వెనుకాడటం లేదు. సరిగ్గా ఇటువంటి సంఘటనే ఒకటి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు కన్నతండ్రినే యాక్సిడెంట్ రూపంలో కడతేర్చి తండ్రి పేరున ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను క్లైమ్ చేసుకోవాలని చూశాడు. చివరకు కొడుకు పన్నిన పన్నాగం బట్టబయలు కాగా, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది.
అంతా యాక్సిడెంట్ అనుకున్నారు... కానీ...
అమలాపురం రూరల్ మండలం సాకుర్రుకు చెందిన విప్తర్తి వెంకటరమణ గత నెల ఏ్రపిల్ నెలలో కామనగరువు బైపాస్ రోడ్డులో ద్విచక్రవాహనం పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఒకటి గుద్ది వెళ్లిపోయింది.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అదుపుతప్పి పడిపోయిన వెంకటరమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో స్థానికులు హుటాహుటీన అమలాపురంలోని ఓ ఆసుప్రతికి తరలించారు. కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంకటరమణ కుమారుడు తనతండ్రి యాక్సిడెంట్ కేసులో గాయాలపాలయ్యాడని అమలాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలైన విప్తర్తి వెంకటరమణ కోమాలోకి వెళ్లగా ఆయన అనూహ్యంగా కోలుకుని కోమాలోనుంచి బయటకు వచ్చాడు. ఈక్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు.. అసలు విషయం పోలీసుల దర్యాప్తులో బట్టబయలయ్యింది..
కుమారుడి కుట్రకోణం ఇలా తెలిసింది..
చెడు వ్యసనాలతోపాటు రాజకీయంగా గొప్పల కోసం తిరిగే విప్పర్తి హర్షవర్ధన్ ఆర్థికంగా నష్టపోవడంతో అక్రమ మార్గంలో సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తన తండ్రి వెంకటరమణ యాక్సిడెంట్ కేసులో చనిపోతే అతని పేరున బ్యాంకులు,ఇతర ఎల్ఐసి ఇన్సూరెన్స్ సులువుగా పొందచ్చని ఒక పథకం పన్నాడు. దానిలో భాగంగా గత ఏప్రిల్ నెలలో తన తండ్రి వెంకటరమణ కామనగరువు బైపాస్ లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముందస్తు వ్యూహంలో భాగంగా అద్దెకు కారు తెచ్చుకుని ఆ వెనుకనే కారుతో గుద్ది అక్కడి నుంచి జారుకున్నాడు. దాన్ని యాక్సిడెంట్ కేసుగా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.ఈ ఘటనపై రూరల్ పోలీస్ కేసు నమోదు చేసారు. ఎస్పి బి కృష్ణారావు ఆదేశాలపై అమలాపురం రూరల్ సిఐ డి.ప్రశాంత్ కుమార్ నేతృత్వంలో అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ బాబు సిబ్బంది కేసు దర్యాప్తును మరింత లోతుల్లోకి వెళ్లి దర్యాప్తుచేశారు. యాక్సిడెంట్ చేసిన కారు ఎవరిది అన్న కోణంలో సీసీ కెమెరాల ద్వరా దర్యాప్తు చేపట్టారు.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో అటువైపుగా వెళ్లని కారు నెంబరు ఆధారంగా అది అద్దె కారుగా ఆ కారును ఆరోజు విప్పర్తి హర్ష వర్థన్ అద్దెకు తీసుకున్నాడని తేలింది.. యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయిన కారును రాజమండ్రిలో రిపేర్ చేయించి కారును యజమానికి అప్పగించకుండా దాచిపెట్టి కారు రిపేర్‌లో ఉందని, రిపేర్ అయ్యాక కారు ఇస్తానని నమ్మిస్తూ వచ్చాడు.. ఇదే విషయాన్ని సదరు కారు యజమాని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. దీంతో తండ్రి వెంకట రమణను యాక్సిడెంట్‌లో గుద్దింది సొంత కుమారుడే అని ప్రాధమికంగా నిర్ధారించుకున్న పోలీసులు నిందితుని కోసం గాలించారు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.. ఇదిలా ఉంటే ఊహించని రీతిలో బ్రతికిపోయి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోమాలోంచి బయటకు వచ్చిన తండ్రి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టిన పోలీసులు కుమారుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
విశ్వరూప్ తనయుడి అనుచరుడిగా...
తండ్రినే యాక్సిడెంట్ చేసి ఆపై ఆయన పేరుమీద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను సులభంగా పొందుకోవచ్చని కుట్ర పన్నిన నిందితుడు విప్తర్తి హర్షవర్థన్ వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ అమలాపురం నియోజకవర్గ కన్వీనర్ పినిపే శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు. హర్షవర్థన్ తండ్రి కోమాలో ఉన్న సమయంలో శ్రీకాంత్ స్వయంగా వెళ్లి పరామర్శించాడు.





















