Kolkata: హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్ చివరి మాటలివే!
Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ తను పని చేస్తున్న ఆర్‌జీ కార్ హాస్పిటల్‌ని రెండో ఇల్లుగా భావించేది. ఈ సారి దుర్గ పూజను చాలా గొప్పగా చేసుకోవాలని ఆశపడినట్టు తల్లి వివరించారు.
Kolkata Doctor Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌ని కొందరు కావాలనే టార్గెట్ చేశారన్న వాదనలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కాస్త కూడా విరామం లేకుండా వరుస పెట్టి షిఫ్ట్‌లు వేసి తనను ఇబ్బందికి గురి చేసినట్టు తోటి వైద్యులు చెబుతున్నారు. అయితే...ఎవరు ఎలా ఇబ్బంది పెట్టినా వైద్య వృత్తిని మాత్రం ఆమె చాలా గౌరవించేది. అంతే కాదు. హాస్పిటల్‌ని తన రెండో ఇల్లుగా చూసుకుంది. పేషెంట్ మేనేజ్‌మెంట్‌లో ఆమె చాలా చురుగ్గా ఉండేదట. సరిగ్గా కొవిడ్ సమయంలో MBBS చదువుతున్న ఆమె ఆ సయమంలో ఎంతో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడడాన్ని గమనించింది. అందుకే...రెస్పిరేటరీ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ చేసింది. అయితే...ఆగస్టు 9న ఈ ఘటన జరగక ముందు ఆమె దాదాపు 36 గంటల పాటు పని చేసింది. అన్ని గంటలు విరామం లేకుండా పని చేయడం వల్ల అలసటగా అనిపించింది. సెమినార్‌లో హాల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలోనే ఆ ఘోరం జరిగిపోయింది. తెల్లవారి అక్కడి ట్రైనీ డాక్టర్లు ఆమె మృతదేహాన్ని చూశారు. ఆమె డెడ్‌బాడీ పక్కనే ల్యాప్‌టాప్, మొబైల్ పడి ఉన్నాయి.
తన కూతురికి భక్తి ఎక్కువని చెప్పింది బాధితురాలి తల్లి. అంతే కాదు. దుర్గ పూజను చాలా శ్రద్ధగా చేసేదని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఇంట్లో దుర్గ పూజ చాలా గొప్పగా చేసుకున్నామని వివరించారు. ఇప్పుడు మూడోసారి కూడా అదే విధంగా చేయాలని తను చాలాసార్లు అనుకుందని, కానీ ఇంతలోగా ఇదంతా జరిగిపోయిందని చెప్పారు. తను బతికి ఉండి ఉంటే ఈ పూజ సమయానికి పీజీ పూర్తై ఉండేదని, ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకం అని అన్నారు బాధితురాలి తల్లి. ఇక ఈ ట్రైనీ డాక్టర్ ఇంట్లో వాళ్లందరికీ రోల్ మోడల్‌గా ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. (Also Read: Kolkata: కోల్‌కత్తా డాక్టర్ డైరీలో ఏం రహస్యాలున్నాయి? చిరిగిపోయిన పేజీయే కీలక సాక్ష్యం కానుందా?)
"జేఈఈతో పాటు మెడిసిన్‌లోనూ క్వాలిఫై అయింది. తను MBBS సెలెక్ట్ చేసుకుంది. రెండు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ తెచ్చుకుంది. పీజీ చేసేందుకు ఆర్‌జీ కార్ హాస్పిటల్‌ని ఎంపిక చేసుకుంది. ఆమే మాకు రోల్‌మోడల్"
- బాధితురాలి బంధువు
ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. సీబీఐకి ఈ కేసుని అప్పగించింది హైకోర్టు. ఈ మేరకు అధికారులు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఆర్‌జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసుల ఎదుట ఈ నేరం చేసినట్టు అంగీకరించాడని సమాచారం. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం జరగాల్సిందేనని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని ఉరి తీయాలంటూ నినదిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులూ తమకు కచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందని భరోసాతో ఉన్నారు.