Karimnagar: బంధువు హత్యకు పక్కా ప్లాన్, పోలీసుల ఎంట్రీతో సీన్ తారుమారు - వీళ్లది మామూలు స్కెచ్ కాదు
Karimnagar Crime News: కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీసినా, తప్పించుకోవాలి అనుకున్న నిందితుల పథకం ఎలా బెడిసి కొట్టిందో ఆ వివరాలు ఇలా ఉన్నాయి
Karimnagar Land Issue: భూమి వివాదంలో తమకు అడ్డుగా నిలుస్తున్న దగ్గరి బంధువులను తొలగించుకోవడానికి కొందరు క్రిమినల్స్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు. మొదట వర్కౌట్ అయినా పోలీసులు అనుమానించి లోతుగా దర్యాప్తు జరపడంతో నేరస్తులు అందరు అరెస్ట్ కటకటాల పాలయ్యారు. యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీసినా, తప్పించుకోవాలి అనుకున్న వాళ్ల పథకం ఎలా బెడిసి కొట్టిందో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భూ వివాదంతో మర్డర్ ప్లాన్..
బెజ్జంకి మండలం కేంద్రానికి చెందిన రావుల శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని సరస్వతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. హుస్నాబాద్‌లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న శ్రీనివాస్ తన చిన్నాన్నకు చెందిన ఇద్దరు కుమార్తెలు లచ్చవ్వ, లక్ష్మీలకు భూ వివాదాలు ఉండగా వాటికి సంబంధించి పంచాయతీలకు హాజరయ్యాడు. అయితే లచ్చవ్వకు భూమి న్యాయబద్ధంగా చెందుతుందని శ్రీనివాస్ పంచాయితీలో తన అభిప్రాయం చెప్పాడు. తన తల్లికి రావాల్సిన ఎనిమిది గుంటల భూమిని రాకుండా చేస్తున్నారని లక్ష్మి కుమారుడు పరశురాములు శ్రీనివాస్ పై కక్ష పెంచుకున్నాడు. దీంతో తన మనసులో మెదిలిన పథకాన్ని మిత్రులతో షేర్ చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో సుంకరి పనిచేస్తున్న మామిడి వేణు కరీంనగర్లో ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ చదువుతున్న రహీంఖాన్ పేట కు చెందిన బొల్లం శ్రీధర్ లకు తన ప్లాన్ ని వివరించాడు. దీంతో గత రెండు నెలలుగా వీరంతా పకడ్బందీగా ప్లాన్ చేసి శ్రీనివాస్‌కి చెందిన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు.
అమలు చేశారు ఇలా...
మే 8వ తేదీన రాత్రి సమయంలో శ్రీనివాస్ తన భార్య రిషి ఇంద్రమణీతో కలిసి కోర్టు చౌరస్తా లో ఉన్న ఓ చర్చిలో ప్రార్థనలకు వెళ్లారు. అప్పటికి సిద్ధంగా ఉంచుకున్న శ్రీధర్ టాటా సుమో కోర్టు చౌరస్తా వద్ద పరశురాములుని పికప్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉండగా మామిడి వేణు చర్చి వద్ద శ్రీనివాస్ కదలికలను గమనించి వీరికి సమాచారం ఇచ్చాడు. రాత్రి 10.45 గంటల సమయంలో ఆదర్శ నగర్ వద్ద టాటా సుమోతో శ్రీనివాస్ అతని భార్య వెళ్తున్న బైక్‌ని మితిమీరిన వేగంతో ఢీ కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ భార్య ఈ నెల 17వ తేదీన చికిత్సపొందుతూ చనిపోయింది. అయితే సంఘటన జరిగిన ప్రాంతంలో CCTvలు లేకపోవడంతో మొదట యాక్సిడెంట జరిగిందని అంతా భావించారు.
శ్రీనివాస్ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను షేర్ చేసిన తరువాత పోలీసులకు అనుమానం మొదలైంది. లోతుగా దర్యాప్తు చేయగా వారి అనుమానం నిజమైంది. నిందితులు యాక్సిడెంట్ జరిగిన రోజున సమీప ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఏది ఏమైనా ఒక చిన్న భూ వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం విచారకరం. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తో బాటు అదనపు డీసీపీ శ్రీనివాస్, టౌన్ ఏసిపి తుల శ్రీనివాస్ టౌన్ సిఐ దామోదర్ రెడ్డి, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు