Kamareddy News: సర్పంచ్ భర్త దారుణ హత్య! ఎస్పీ ఆఫీసుకు దగ్గర్లోనే ఘోరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ శివారులో రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ను అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి చెల్లించేవారు. ఇందులో సుమారు రూ.80,000 వేల వరకు లెక్కలు చూపకపోవడంతో నర్సాగౌడ్ కు పలువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది.
దీని విషయంలోనే కక్ష పెంచుకొని నర్సాగౌడ్ ను హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నర్సా గౌడ్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఉదయం వరకు ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నర్సాగౌడ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





















