Nizamsagar: ప్రభుత్వ పథకాలు కావాలంటే నా కోరిక తీర్చాలి... వెలుగులోకి మరో కాలకేయుడి ఆగడాలు
గ్రామస్తుల కష్టాలు తీర్చాల్సిన సర్పంచ్... కాలకేయుడిలా మారాడు. ప్రభుత్వ పథకాలు అందాలంటే తన కోరికలు తీర్చాలని మహిళలను వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఆయన గ్రామానికి సర్పంచ్, ప్రథమ పౌరుడుగా సేవలందిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. ఆదర్శం సంగతి ఏమో గానీ రోజుకో మహిళను వేధిస్తూ వివాదస్తుడుగా మారుతున్నాడు. కొత్త పింఛన్లు అందాలంటే, ప్రభుత్వ పథకాలు దక్కాలంటే తన కోరిక తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నాడు.
Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట..
తెలంగాణ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామ సర్పంచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మహిళల రక్షణకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ అవేమీ తనకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. మద్యం మత్తులో రోజుకో మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. గ్రామ ప్రజలను బిడ్డలుగా చూసుకోవాల్సిన అతను అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. తనతో గ్రామ సర్పంచ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామానికి చెందిన మహిళ నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా పలుమార్లు గ్రామ మహిళలను వేధించిన ఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావద్దంటూ సర్పంచ్ ను మందలించిన సందర్భాలు ఉన్నాయి. అయినా సర్పంచ్ తీరులో మార్పు లేదు. విచ్చలవిడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. అధికార పార్టీ సర్పంచ్ నని తనను ఎవ్వరూ ఏమి చేయలేరనే ధీమాతో తన కోరిక తీర్చితేనే ప్రభుత్వ పథకాలను అందేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని గ్రామానికి చెందిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది.
Also Read: కామారెడ్డి జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ కేసులు
తన కోరిక తీర్చితేనే ప్రభుత్వ పథకాలను అందేలా చేస్తానని సర్పంచ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచ్ వేధింపులకు తట్టుకోలేక సమావేశాలకు కూడా వెళ్లలేకపోతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కాగా సర్పంచ్ నువ్వోస్తావా లేదా ఎవ్వరినైనా తీసుకువస్తావా అంటూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన చెందింది. మీటింగ్ కు ఆమె వెళ్లలేక కుమారుడిని పంపితే మీ అమ్మను రమ్మను అంటూ బెదిరించాడని తెలిపింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. పోలీసులు సర్పంచ్ చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి