Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Mlc Anantababu Arrest : కాకినాడ జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జీజీహెచ్ లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Mlc Anantababu Arrest : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అనంతబాబును విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతబాబును ఇవాళ రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని దళిత, ప్రజాసంఘాలతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాకినాడ పోలీసులు ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ప్రెస్ మీట్ లో తెలుపనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. ఆ తర్వాత ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
సుబ్రహ్మణ్యం స్నేహితుల విచారణ
అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. సుబ్రహ్మణ్యం ఇద్దరు స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన రోజు వాళ్లిద్దరూ సుబ్రహ్మణ్యంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఆచూకీ తెలపాలని కాకినాడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా, ఇద్దరు తమ వద్దనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబుని కోర్టుకు తీసుకొస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకొని వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు.
ఎమ్మెల్సీని రహస్య ప్రాంతంలో ఉంచి డ్రామాలు!
ఎమ్మెల్సీ అనంతబాబును సజ్జల రామకృష్ణారెడ్డి రహస్య ప్రాంతంలో ఉంచి డ్రామాలు ఆడించారని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న దళిత నాయకులు కారం శివాజీ, జూపూడి దళితుడి హత్య కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దళిత సంఘాల ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ దావోస్ లో ఉండి , సజ్జల రామకృష్ణారెడ్డితో వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. రంపచోడవరం ఎమ్మెల్యేను అమాయకుల్ని చేసి అనంతబాబు అకృత్యాలు చేశారని ఆరోపించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి నివాళులర్పించడానికి వెళ్లనివ్వకుండా రామవరంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Also Read : Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!