Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
Lokesh On Ysrcp Govt : కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో నారా లోకేశ్ విజయవాడ కోర్టులో హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు.
Lokesh On Ysrcp Govt : కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నమోదైన కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. 2020లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో లోకేశ్ సీఐడీ కోర్టు వద్దకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు అయింది. లోకేశ్, కొల్లు రవీంద్ర, జాస్తి సాంబశివరావు, దేవినేని చందుపై అప్పట్లో అంటు వ్యాధుల చట్టం ప్రకారం కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు లోకేశ్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో లోకేశ్ తో పాటు కొల్లు రవీంద్ర ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. లోకేశ్ కోర్టుకు హాజరయినప్పుడు పోలీసులు రహదారులు దిగ్బంధించారు. టీడీపీ నేతలను కోర్టు వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పోలీస్ రాజ్యం
వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా దాడులకు తెగపడుతున్నారని నారా లోకేశ్ విమర్శించారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ప్రధాన ఉదాహరణ అన్నారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపినా ఆ కుటుంబానికి న్యాయం చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. హత్య జరిగిన తర్వాత 72 గంటల్లో ఎమ్మెల్సీ అనంత బాబు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా వైసీపీ ముఖ్యనేతలను కలిశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారా అని లోకేశ్ ప్రశ్నించారు. తాను కోర్టుకు హాజరైతే 500 మంది పోలీసులు పెట్టిన ప్రభుత్వం.. ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు పట్టుకోలేకపోతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2 కోట్లు, పొలం ఇస్తానని బాధితులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం ఉందని లోకేశ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం ఓ చిన్న కామెంట్ పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది హత్య చేసి దర్జాగా తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల మీటింగ్ లా ఉంది
ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపై లోకేశ్ విమర్శలు చేశారు. దావోస్ లో ఏపీ రాజధాని ఏదంటే సీఎం జగన్ ఏంచెబుతారని లోకేశ్ ప్రశ్నించారు. పీపీఏలు ఎందుకు రద్దు చేశారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో అడిగితే సీఎం ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దావోస్‌లో వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉంది కానీ పెట్టుబడుల కోసం జగన్ అక్కడికి వెళ్లినట్లు లేదని ఎద్దేవా చేశారు. దావోస్‌లో పారిశ్రామిక వేత్తలు ఎవరూ జగన్ కు కలవడానికి రావడంలేదన్నారు. గత 24 గంటల్లో సీఎం జగన్ ను కలిసి ఏకైక పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ మాత్రమేనని, అదానీని కలిసేందుకు దావోస్ వెళ్లడం ఎందుకు దిల్లీ వెళ్లినా సరిపోతుందన్నారు. ఇందుకోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.