Kakinada News : కాకినాడలో దారుణం, ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది
Kakinada News : కాకినాడ కూరాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని యువతి గొంతు కోసి హత్య చేశాడు.
Kakinada News : కాకినాడ కూరాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రేమించలేదని యువతి గొంతు కోసి హత్య చేశాడు సూర్యనారాయణ అనే యువకుడు. ప్రేమ పేరిట యువతిని కొంతకాలంగా సూర్యనారాయణ వేధిస్తున్నాడు. శనివారం స్కూటీపై వెళ్తోన్న యువతిని వెంబడించిన సూర్యనారాయణ యువతిని హత్యచేశాడు.
అసలేం జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలారం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ(25) కొంతకాలంగా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కె.గంగవరం గ్రామానికి చెందిన దేవిక(22)ను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. వీరు కూరాడలోని వారి బంధువుల ఇంటి వద్ద ఉండేవారు. ప్రేమిస్తున్నానంటూ సూర్యనారాయణ వేధిస్తున్నాడని యువతి బంధువులు పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టారు. దీంతో పెద్దల సూచనతో యువకుడి బంధువులు సూర్యనారాయణను అతడి సొంతూరు బాలారం పంపించేశారు. దీంతో పగపెంచుకున్న యువకుడు శనివారం ప్లాన్ ప్రకారం బైక్ పై కూరాడ వెళ్తోన్న దేవికను...కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డగించాడు.
యాసిడ్ సీసా కూడా
తనను ప్రేమించాలని దేవికను సూర్యనారాయణ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకున్న స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. యువతిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పెదపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడు తన వెంట యాసిడ్ సీసా కూడా తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు
తెలంగాణలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో వివాహితపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. కొంతకాలం నుంచి సదరు వివాహితను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలని యువకుడు మహిళ వెంటపడుతున్నాడు. సదరు మహిళపై శుక్రవారం రాత్రి పెట్రోల్ పోసి అతను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి సెల్ఫీ సూసైడ్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం షంషీర్ నగర్ కు చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం పెద్ద లంబాడి తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్, ఈ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రాజకుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి రేపు మాపు అంటూ నెలలు గడుపుతున్నాడని సెల్ఫీ వీడియోలో యువతి ఆరోపించింది. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి అడగడంతో రాజ్ కుమార్ ముఖం చాటేయడంతో తాను మోసపోయానని యువతి సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వెల్లగక్కుతూ పురుగుల మందు తాగింది. నేన్నేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు యువతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. ఆరోగ్య కేంద్రం సిబ్బంది యువతికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం పోలీసులకు సమాధానం ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం యువతిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆరోగ్యం క్షీణించి యువతి మృతి చెందింది.
Also Read : Maharashtra: బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, 14 మంది సజీవదహనం
Also Read : పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు - ఉలిక్కిపడి నిద్రలేచిన పోలీసులు, స్థానికులు