Jagityal Crime: తెల్లవారితే కూతురి పెళ్లి.. బామ్మర్దిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసిన వధువు తండ్రి
మరికొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. కానీ అనుకోని సంఘటన ఇంట్లో పెను విషాదాన్ని నింపింది.
Jagityal Crime: అప్పటివరకూ ఆ ఇల్లు పెళ్లిసందడితో కళకళలాడింది. మరికొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. కానీ అనుకోని సంఘటన ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. కూతురి పెళ్లిరోజే తండ్రి హంతకుడిగా మారాడు. గొడ్డలితో దాడి చేసి బామ్మర్దిని హత్యచేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. పొలాసకు చెందిన పౌలేస్తశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ వీర్ల శంకర్ తన సోదరి జమునను ప్రస్తుత జగిత్యాల జిల్లా అంబారిపేటకు చెందిన వెంకటేష్‌కు ఇచ్చి చాలా ఏళ్ల కిందట వివాహం జరిపించారు. జమున, వెంకటేష్ దంపతులుకు ఇద్దరు కుమార్తెలు ప్రవళిక, పూజిత ఉన్నారు. కొన్నేళ్లకిందట వెంకటేష్ మరో వివాహం చేసుకున్నాడు. ఓ అద్దె ఇంట్లో ఆమెతో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజుల కిందట వెంకటేష్ పెద్ద కుమార్తె ప్రవళిక పెళ్లి నిశ్చమైంది.
మేనకోడలు ప్రవళిక వివాహం ఖర్చుల నిమిత్తం తన చెల్లెలు జమున పేరిట ఉన్న కొంత పొలాన్ని వీర్ల శంకర్(48) విక్రయించారు. గురువారం నాడు ప్రవళిక వివాహానికి అంతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో తెల్లవారితే పెళ్లి అనగా.. వధువు తండ్రి వెంకటేష్ పెళ్లి జరిగే ఇంటికి వచ్చి శంకర్‌తో గొడవకు దిగాడు. పెళ్లి పనుల్లో భాగంగా దుంపిడిగుంజను తీసుకొస్తున్న శంకర్‌ను అడ్డుకుని వెంకటేష్ పనులకు ఆటంకం కలిగించాడు. చెప్పేది వినకుండూ పనులు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
తనకు తెలియకుండా పొలం ఎందుకు అమ్మేశావంటూ ఆవేశంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో గొడ్డలితో వీర్ల శంకర్‌పై దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన శంకర్ తల్లి సైతం గాయాలయ్యాయి. అయితే వెంకటేష్ చేసిన గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మార్గంమధ్యలోనే శంకర్ చనిపోయాడని నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేనకోడలు పెళ్లి చేస్తున్న వ్యక్తిని వధువు తండ్రే ఇలా హత్య చేయడాన్ని బంధువులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూతురి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని ఎంతో ఆశగా చూసిన మహిళ.. సోదరుడి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.