World Cancer Day: వీటిని రోజూ తింటే పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం... మంచి ఆహారం, వ్యాయామమే క్యాన్సర్‌ను అడ్డుకోగలవు
మనం తినే ఆహారమే ఆరోగ్యాన్ని నిర్ణయించేది. కొన్ని రకాల ఆహారాల వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది.
ప్రపంచంలో ప్రమాదకరమైన రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఆ రోగానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’నిర్వహిస్తారు. క్యాన్సర్ శరీరంలో ఒక్క అవయవానికే వచ్చేది కాదు, ఏ ప్రదేశంలో దాని కణాలు ఉత్పత్తి అధికంగా జరుగుతుందో ఆ భాగం క్యాన్సర్ బారిన పడినట్టే. ఆ మహమ్మారి రోగం బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. పోషకాలున్న ఆహారాన్ని తినాలి. వ్యాయామాలు చేయాలి. కొన్ని రకాల ఆహారపదార్థాలు అధికంగా తినడం వల్ల ఈ మధ్య పొట్టక్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.
మనదేశంలో...
భారత్‌లో పొట్ట క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో 20 శాతం కంటే తక్కువ మందిలో మాత్రే ఆ రోగం ప్రాథమిక దశలో నిర్ధారణ అయ్యింది. మిగతావారిలో మాత్రం పరిస్థితి విషమించాక గుర్తించారు. మన దేశంలో పురుషులకు అధికంగా వచ్చే క్యాన్సర్లలో పొట్టక్యాన్సర్ మూడో స్థానంలో ఉంది. 15 నుంచి 44 వయసు మధ్య వారిలో ఇది అధికంగా కనిపిస్తోంది. దీని బారిన పని ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య కూడా అధికమే.
పొట్టక్యాన్సర్ లక్షణాలు...
పొట్టలో క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ముందు పొట్టలోపలి లైనింగ్ పై ప్రభావం మొదట పడుతుంది. ప్రారంభంలో చాలా అరుదుగా లక్షణాలను ప్రదర్శిస్తాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. మింగడం ఇబ్బంది పడడం, పొట్ట ఉబ్బరంగా, నిండుగా అనిపించడం, పొత్తికడుపు దగ్గర ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించడం, గుండెల్లో మంట, వికారం, పొట్టనొప్పి, వాంతులు, మలబద్ధకం, పొట్ట వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. కుటుంబచరిత్రలో ఈ క్యాన్సర్ ఉన్నా కూడా భవిష్యత్తులో ఆ కుటుంబంలో పుట్టేవారికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాటిని మనం నివారించలేం. కానీ ఎలాంటి కుటుంబ చరిత్ర లేకుండా వచ్చే క్యాన్సర్లకు మాత్రం అనారోగ్యకరమైన జీవనశైలే కారణం అవుతుంది.
ఉదర క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారాలను దూరంగా పెట్టడం ద్వారా కొంతమేరకు ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
1. బీఫ్, పోర్క్, గొర్రె మాంసాలు క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వీటిని అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ (ఉదర క్యాన్సర్) వచ్చే అవకాశం 45 శాతం పెరుగుతుంది.
2. కేకులు, పేస్ట్రీలు, నెయ్యి, వెన్న, వనస్పతి, డీప్ ఫ్రై చేసిన ఆహారంలో ట్రాన్స్‌ఫ్యాట్‌లు అధికంగా ఉంటాయి. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.
3. ఆల్కహాల్ చాలా ప్రమాదకారి. ఇది కణాలలోకి కార్సినోజెన్ల వ్యాప్తిని పెంచుతుంది. కణాలను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.
4. ధూమపానం కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుంది. ముఖ్యంగా అన్నవాహికకు సమీపంలో ఉన్న పొట్ట ఎగుల భాగంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధూమాపానాన్ని పూర్తిగా మానివేయాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.