Jagityal Accident: జగిత్యాలలో ఘోర ప్రమాదం.. కుటుంబంలో ముగ్గురు మృతి, ఛిద్రమైన శరీర భాగాలు
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరణించారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు మరో బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని పోలీసులు వెల్లడించారు.
వివరాలివీ..
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపేటకు చెందిన కోడిపుంజుల తిరుపతి అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అదే వారి జీవనాధారం. అతనికి భార్య మనోజ, కుమారులు ఆదిత్య, కన్నయ్య, కుమార్తె చిట్టి ఉన్నారు. తిరుపతి భార్య మనోజ అత్త గత మూడు నెలల క్రితం మృతి చెందింది. గురువారం మూడు నెలల కార్యక్రమం ఉండడంతో కుటుంబ సమేతంగా వారంతా కలిసి తిరుపతి బైక్‌పై ధర్మపురి మండలం దమ్మన్నపేటకు బయలుదేరాడు. కార్యక్రమం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో భార్యాపిల్లలను కూడా ఎక్కించుకొని వస్తున్నాడు.
Also Read: Nalgonda Crime: బ్లేడుతో యువతి గొంతు కోసిన వ్యక్తి.. పారిపోయిన నిందితుడు, కారణం ఏంటంటే..
ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి తిరిగి కొత్తపేట వస్తుండగా పాశిగామ శివారులో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ వారి బైక్‌ను ఢీకొట్టింది. అత్యంత వేగంగా డీసీఎం ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న వారంతా ఎగిరిపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వారిపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. తీవ్ర గాయాలతో చిట్టీ, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. భార్య మనోజ, కుమారుడు ఆదిత్యకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా ఉందని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో శరీర భాగాలు ఛిద్రమై రక్తపు మడుగు ఉండడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అంతకుముందే స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hyderabad: ఆన్‌లైన్ క్లాసులో ఊహించని ట్విస్ట్.. భయపడిపోయిన లెక్చరర్, విద్యార్థులు