Hyderabad: హుస్సేన్ సాగర్ ఒడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహం.. అప్పటికల్లా నిర్మాణం పూర్తి, మంత్రి వెల్లడి
ఈ అంబేడ్కర్ మహా విగ్రహం ఏర్పాటు పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేకరులకు వెల్లడించారు. ఈ విగ్రహ రూపం ఎలా ఉంటుందో వివరించారు.
తెలంగాణలో ప్రస్తుతం దళితుల అంశం చుట్టూ రాజకీయాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంతో ఒక్కసారిగా రాజకీయాలన్నీ ఆ వైపు మళ్లాయి. అన్ని రాజకీయ పార్టీలు దళితుల పల్లవి ఎత్తుకున్నాయి. దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం, గతంలో ప్రకటించిన ఓ ప్రాజెక్టును త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ ఒడ్డున రూ.100 కోట్ల ఖర్చుతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని ఇప్పుడు ప్రభుత్వం నెరవేర్చనుంది. ఈ అంబేడ్కర్ విగ్రహం 11 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. తాజాగా, ఇందుకు సంబంధించిన పనులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు.
ఈ అంబేడ్కర్ మహా విగ్రహం ఏర్పాటు పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేకరులకు వెల్లడించారు. ఈ విగ్రహ రూపం ఎలా ఉంటుందో వివరించారు. ఈ విగ్రహం అడుగు భాగంలో 50 అడుగుల ఎత్తు మేర పార్లమెంటు భవన ఆకృతిలో ఓ నిర్మాణం ఉంటుందని వివరించారు. దానిపైన భారీ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. ఈ భారీ నిర్మాణాన్ని గరిష్ఠంగా 15 నెలల కాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు.
అంబేడ్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందని ఆయన వివరించారు. అంబేడ్కర్ విగ్రహం చుట్టుపక్కల సువిశాలమైన స్థలంలో అంబేడ్కర్ పార్కును కూడా నిర్మించబోతున్నారు. విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం వెడల్పు 45.5 అడుగులు ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ ప్రాంతంలో ధ్యానమందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్, సువిశాలమైన పార్కింగ్, వాష్ రూంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అలాగే, ఇక్కడ స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు జరుగుతాయన్నారు.
ఆలస్యం అందుకే..
విగ్రహ నిర్మాణం ఆలస్యం అయినందుకు గల కారణాలను మంత్రి వివరించారు. పలు పరీక్షలు, డిజైన్ ఖరారు, సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున అలస్యమైందని మంత్రి అన్నారు. చైనా, సింగపూర్‌లలో ఇటువంటి భారీ విగ్రహాలను పరిశీలించామని, ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్నివర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా, నగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా దీని నిర్మాణం ఉంటుందన్నారు.
గుజరాత్ తర్వాత రెండో ఎత్తైన విగ్రహం
ఈ నిర్మాణం పూర్తయితే గుజరాత్‌లో నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం తర్వాత దేశంలో రెండో ఎత్తైన విగ్రహం తెలంగాణలోనే ఏర్పాటయినట్లు అవుతుంది. ఈ విగ్రహాన్ని పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇది రాష్ట్రంలోనే ముఖ్య పర్యాటక ప్రదేశంగా మారనుందని వివరించారు.