Hyderabad News: తన భార్యను పెళ్లి చేసుకోవడమే కాకుండా చెల్లి అని పిలవమంటూ ఒత్తిడి, ఆక్రోశంలో ఏంచేశాడంటే?
Hyderabad News: నారాయణగూడ దంపతుల హత్యాయత్నం కేసులో నిందితుడు నాగులసాయిని పోలీసులు విచారిస్తున్నారు. తన భార్యను పెళ్లి చేసుకోవడమే కాకుండా చెల్లి అని పిలవమనడంతోనే దాడి చేసినట్లు వెల్లడించాడు.
Hyderabad News: తన భార్యను పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తనను చెల్లి అని పిలవాలని ఒత్తిడి చేశాడని ఆ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానని నారాయణగూడలో దంపతుల హత్యాయత్నం కేసులో నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. నాగుల సాయి దాడిలో పది నెలల బాబు, నాగరాజు, ఆర్తీ గర్భంలోని శిశువు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆర్తీ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన నాగుల సాయి, చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆర్తిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పని చేస్తుండగా.. ఆర్తి నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలు అమ్మతుండేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాప వయసు మూడేళ్లు. అయితే పాపు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. కొట్టుకొని తిట్టుకొని రోజూ ఉండటం కంటే విడిపోవడం మంచిదనుకొని భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది ఆర్తీ. తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్ తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే తన వదిన అయిన జితేందర్ భార్య తనకు తెలిసిన నాగరాజును ఆర్తీకి పరిచయం చేసింది. నాగరాజు చిక్కడపల్లిలో ట్యాంక్ క్లీనర్ గా పని చేస్తున్నాడు. ఆర్తీ నాగరాజు మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా పెళ్లి చేసుకున్నారు.
ఆర్తీ రెండో పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకున్న మొదటి భర్త నాగుల సాయి.. ఆమెపై పగ పెంచుకున్నాడు. తనను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆర్తీని, ఆమె వివాహం చేసుకున్న నాగరాజు, తనకు అడ్డుపడుతున్న ఆర్తీ సోదరుడు జితేందర్ ను చంపేయాలని నాగులసాయి రెండేళ్ల క్రితమే కుట్ర పన్నాడు. భార్యను చంపేందుకు వెళ్లగా జితేందర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నాగుల సాయిపై కేసు నమోదు చేయగా ఏడాది పాటు జైలులో ఉండి వచ్చాడు. ఏడాది క్రితం మరోసారి నారాయణగూడ పరిధిలో నాగుల సాయిపై కేసు నమోదు అయింది.
ఈ నెల 7వ తేదీన నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగులసాయిని నాగరాజు అడ్డగించాడు. తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుందని కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. నాగరాజు అలా చెప్పడంతో వారిపై కక్షను పెంచుకున్న నాగులసాయి పథకం ప్రకారం వారిపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకొచ్చి ఆర్తి, ఆమె భర్త నాగరాజులపై చల్లి నిప్పంటించాడు. ఆ సమయంలో ఆర్తి చేతుల్లో తమ కుమారుడు పది నెలల విష్ణు కూడా ఉన్నాడు. పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోయాడు. ఆర్తీ గర్భంలో ఉన్న 5 నెలల శిశువు కూడా మృతి చెందింది.