Hyderabad Crime News: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై లైంగిక దాడి.. ఆ మహిళ నిలదీయడంతో..!
ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి .. ఆమెకు జీవితాన్ని ఇవ్వకపోగా ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కేవలం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారితో పాటు వారి కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాలలో వారి సంతానం ముఖ్యంగా బాలికలు, యువతులు జీవితాన్ని కోల్పోయి ఏం చేయాలో తోచని పరిస్థితి తలెత్తుతున్నాయి. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి .. ఆమెకు జీవితాన్ని ఇవ్వకపోగా ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి....
మహబూబాబాద్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. 2006లో వివాహం చేసుకున్న మహిళకు ప్రస్తుతం కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లి జరిగిన కొంతకాలానికే భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తరచుగా గొడవలు జరిగేవి. ఇక తాము కలిసి జీవించడం సాధ్యంకాదని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న ఆ మహిళ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన బేతమాల కృష్ణతో పరిచయం ఏర్పడింది. అతడు సెంట్రింగ్ పనిచేసేవాడు.
అసలే భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉన్న మహిళ కావడంతో చనువుగా మెలిగేవాడు. కుటుంబాన్ని పోషిస్తానని, ఆమెకు తోడుగా ఉంటానని నమ్మించాడు. పిల్లల బాధ్యతలు తీసుకుంటానని సైతం చెప్పడంతో అతడి మాయమాటలు నమ్మింది. అతడితో శారీరక సంబంధం కొనసాగిస్తూ సహ జీవనం చేస్తోంది. కొంత కాలం కింద ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తన పిల్లలతో కలిసి వివాహిత నివాసం ఉంటోంది. కొన్ని రోజుల కిందట బోనాల పండుగ సమయంలో మెట్టుగూడలోని తన తల్లి ఇంటికి కుమార్తెను పంపించింది. అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత కుమార్తె ఎందుకో దిగాలుగా ఉండటాన్ని తల్లి గమనించింది.
ఎందుకు దిగాలుగా ఉంటున్నావని, భయానికి కారణం ఏంటని కుమార్తెను తల్లి నిలదీయగా అసలు విషయం తెలిసి, ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఆగస్టు 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బేతమాల కృష్ణ తనపై లైంగిక దాడి చేశాడని కన్నీటి పర్యంతమైంది. తనను కృష్ణ బెదించడంతో ఎవరికీ చెప్పలేదని తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. విషయం తెలుసుకున్న ఆ మహిళ.. బేతమాల కృష్ణను నిలదీయగా అతడు వారితో గొడవపడి పరారయ్యాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు కృష్ణపై పోక్సో చట్టం కింద నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !