(Source: Poll of Polls)
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, నడిరోడ్డుపై భార్యను కిరాతంగా హత్య చేసిన భర్త
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు కిరాతక భర్త.
Hyderabad Crime : హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై భార్యను హతమార్చాడు ఓ కిరాతకుడు. ఆశం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యను హత్య చేశాడు. మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. కరీనా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. శుక్రవారం ఉదయం కరీమా బేగం స్కూల్ కు వెళ్తున్న సమయంలో మహమ్మద్ యూసుఫ్ ఐరన్ రాడ్డుతో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. స్థానికులు నిందితుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వారం క్రితం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ దర్వాజా, జీఎంకే ఫంక్షన్ హాల్ ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పల్‌కు చెందిన కలీమ్(25) అనే యువకుడుపై కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు.
విలేకరిపై కాల్పులు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ న్యూస్ రిపోర్టర్ పై కాల్పులకు పాల్పడ్డారు. శివాలయం కూడలి వద్ద విలేకరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో విలేకరిగా పని చేస్తున్న 45 ఏళ్ల పర్వత రెడ్డి.. పీలేరులోని కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈయనపై గత నెల 31వ తేదీన సాయంత్రం ఈ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సాయంత్రం 5.30కు చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి బయలుదేరి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శివాలయం కూడలి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పర్వత రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వాహనాల టైర్ల కింది నుంచి ఓ రాయి వచ్చి తగలడం వల్లే రక్తస్రావం జరుగుతుందని అంతా భావించారు. కాల్పులు జరిగినట్లు ఎవరికీ తెలియదు.
శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
అయితే ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పర్వత రెడ్డిని పరిశీలించిన వైద్యులు... అతడి శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే అతడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించడంతో.. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ ను వెలికి తీశారని సీఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బాధితుడు పర్వత రెడ్డికి, వారి బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.