Jubileehills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ ఎమ్మెల్యే కజిన్, అతడి కుమారుడు అరెస్టు
Jubileehills Accident : జూబ్లీహిల్స్ ప్రమాదంలో ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో విడుదల చేశారు. కారు తన బంధువులదని తెలిపారు. ఆ కేసులో ఎమ్మెల్యే కజిన్ మీర్జా, అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Jubileehills Accident : బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మరణించగా, ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన... ఈ ప్రమాదానికి కారణమైన కారు తన బంధువులకు చెందినదన్నారు. ఆ కారును అప్పుడప్పుడు తాను కూడా వాడినట్లు తెలిపారు. అందుకే కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించానన్నారు. ప్రమాద సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని ఎమ్మెల్యే షకీల్ వీడియో పేర్కొన్నారు. తన కజిన్ మీర్జా కుమారుడని, ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ను అక్కడివారు కొట్టడంతో అతడు పారిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతిచెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. అయితే మహిళ భయంతో పాపను కింద పడేసిందని, ఆ ప్రమాదంలోనే చిన్నారి మరణించిందన్నారు.
నిమ్స్ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స
బాధిత మహిళ కుటుంబాన్ని ఆదుకోవాలని తన బంధువులకు చెప్పాలని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మహిళ కుటుంబం, పోలీసులతో మాట్లాడానని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీడియోలో కోరారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మహిళలు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉన్న కారు ఢీ కొనడంతో మహారాష్ట్రకు చెందిన కాజల్, సారిక, సుష్మకు తీవ్రగాయాలయ్యాయి. వారికి నిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టిందని బాధిత మహిళలు వాపోయారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఒకరైన కాజల్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. ఆ తర్వాత కాజల్ కుటుంబసభ్యులు కూడా కనిపించకపోవడం సందేహాలకు తావిస్తుంది.
ఇద్దరు అరెస్టు
జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జాను జూబ్లీహిల్స్ లో పోలీసులు అరెస్టు చేశారు. మీర్జాతో పాటు అతడి కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గురైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో వివాదాస్పదం అయింది. కారు నడిపింది తన కజిన్ మీర్జా కుమారుడని, ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో విడుదల చేశారు.