Hyderabad Crime : ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో పెట్టుబడులు, రూ.6 కోట్లు మోసం చేసిన కేటుగాళ్లు!
Hyderabad Crime : ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం లాంటి సినిమాల్లో పెట్టుబడులు అంటూ కోట్లు వసూలు చేశారు కేటుగాళ్లు.
Hyderabad Crime : కేటుగాళ్లు కొత్త రూట్లు వెదుకుతున్నారు. అమాయకుల వీక్ నెస్ ను ఆసరా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం ఇలా పలు టాలీవుడ్ హిట్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టొచ్చంటూ నమ్మించి రూ.6 కోట్లు దోచేశారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్ గా మోసాలకు పాల్పడ్డారు. సీన్ కట్ చేస్తే కానీ బాధితులకు అసలు విషయం బోధపడలేదు. క్లైమాక్స్ లో మోసపోయామని తెలుసుకుని న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు.
అధిక లాభాల పేరిట మోసం
హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ సినిమాల్లో పెట్టుబడులు పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్ పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో కోట్లలో నొక్కేశారు. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది పలు సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించి బాధితుల నుంచి డబ్బు వసూలు చేశారు. పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.
రూ.6 కోట్లు వసూలు
30 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. బాధితులు డబ్బులు తిరిగి అడగడంతో బెదిరింపులకు పాల్పడి దాడులు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అనుచరులతో బెదిరించారని బాధితులు వాపోతున్నారు. మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్ లపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్ లను సీసీఎస్ పోలీసులు అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జల్సాల కోసం దొంగతనం
జల్సాలకు అలువాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్న ఓ పాత నేరస్థుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్ నగర్ లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సందీప్ ఈ కేసు వివరాలు మీడియాకు తెలిపారు. మేడ్చల్ పీయస్ పరిధిలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. మేడ్చల్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి తరికొప్పుల వెంకటేష్(28) చోరీకి పాల్పడ్డాడు. బజాజ్ షోరూమ్ పైస్లాబ్ నుంచి లోపలికి ప్రవేశించిన వెంకటేశ్ 40 స్మార్ట్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు దొంగతనం చేసి ఆటోలో పారిపోయాడు. సీసీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. మేడ్చల్ పరిధిలో కిష్టాపూర్ వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా ఆటోలో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో వెంకటేష్ పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 15 ఐఫోన్లు, 2 శాంసంగ్ ఫోన్లు, 15 షియామి ఫోన్లు, 4 వివో ఫోన్లు,4 వన్ ప్లస్ ఫోన్లు, 2 హెచ్పీ ల్యాప్ టాప్స్, 1 లెనోవో ల్యాప్ టాప్ సుమారు రూ.20 లక్షల విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. నిందితుడు 2012లో దొంగతనం కేసులో జైలు జీవితం అనుభవించాడని తెలిపాడు.