టీచర్‌తో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్త హత్యకు సుపారీ - చివరికి ఏమైందంటే !
వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు భర్తను హత్య చేయించాలని ఓ మహిళ ప్రయత్నించింది. ప్రియుడితో కలిసి రౌడీలకు సుపారీ ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధాలు వారిద్దరినే కాదు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో హత్య చేయడానికి వెనుకాడటం లేదు. కొన్ని కేసులలో అభం శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటన జరిగింది. భార్య చనిపోవడంతో ఓ వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆమెకు అదివరకే వివాహమైంది. దాంతో ఆమె ఏకంగా ప్రియుడి మోజులో పడి భర్తను వదిలించుకోవాలని భావించింది. అందుకోసం భర్తను హత్య చేయించాలని, కిరాయి రౌడీల వరకు మ్యాటర్ వెళ్లింది. రౌడీలు తుపాకీతో ఆమె భర్తపై కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భార్య చనిపోవడంతో వేరే మహిళతో రిలేషన్..
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తుమ్మడవల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ, హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసముంటున్నాడు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు బాలకృష్ణ. అయితే ఆమెకు ఇదివరకే వివాహమైంది. ప్రియుడితో కలిసి ఉండాలంటే భర్త కచ్చితంగా ఊరుకోడు. చట్ట ప్రకారంగా ఏమీ చేయలేమని ఆమె భావించింది. అతడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా కిరాయి రౌడీలతో హత్య చేయిస్తే తన మీద ఎవరికి అనుమానం రాదని భావించింది.
ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్..
నిందితులు బాలకృష్ణ అతడి ప్రియురాలు కలిసి గోషామాల్‌కు చెందిన రౌడీ షీటర్ తో సుపారీ మాట్లాడుకున్నారు. తన భర్తను హత్య చేస్తే మూడు లక్షల రూపాయలు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. ముందుగా అడ్వాన్స్ కింద రెండు లక్షలు కూడా ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకున్న రౌడీ షీటర్ అండ్ గ్యాంగ్ రామస్వామిని హత్య చేసేందుకు చాలా సార్లు విఫలయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బాలకృష్ణ తన ఇంట్లో ప్లంబర్‌గా పని చేస్తున్న యూసుఫ్ తో రెండోసారి పన్నెండు లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడాడు. ఇందుకోసం అడ్వాన్స్ గా రూ.5 లక్షలు చెల్లించారు నిందితులు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తను చంపేందుకు తన దగ్గర ఉన్న లక్ష రూపాయలు కూడా ఇచ్చింది. ఈసారి చాన్స్ మిస్ అవ్వకుండా హత్య చేయాలని చెప్పి మరీ అడ్వాన్స్ ఇచ్చారు రామస్వామి భార్య, ఆమె ప్రియుడు. డబ్బులు అందడంతో యూసుఫ్ తన స్నేహితులు అబ్దుల్ రహమాన్‌పాషా, ఆసిఫ్ ఖాన్, జహంగీర్‌ల సహాయంతో గన్ తో స్వామిని చంపేందుకు ప్లాన్ చేశారు.
నిందితులు అరెస్ట్
ఈ నెల 4వ తేదిన మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో బైక్ పై వస్తున్న స్వామిపై అబ్దుల్ రహమాన్‌పాషా, జహంగీర్‌లు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ శబ్దానికి స్థానికులు రావటంతో నిందితులు పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి చేరుకుని రామస్వామిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. కేసు దర్యాప్తు లో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక పిస్టోల్, 9 మొబైల్ ఫోన్లు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!