Cyber Crime : ఎమ్మెల్యే ప్రొఫైల్ పిక్‌తో వెయ్యి మంది అమ్మాయిలకు టోపీ- రూ. 3 కోట్లు దోచేశాడు!
Cyber Crime : ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన ఓ సైబర్ మాయగాడు ఏకంగా వెయ్యి మంది యువకులను చీట్ చేశాడు. ఎమ్మెల్యే ఫొటోతో ఫేక్ ఇన్ స్టా క్రియేట్ చేసి భారీగా నగదు దోచుకున్నాడు.
Cyber Crime : మొన్న కలెక్టర్ ఫొటో వ్యాట్సప్ డీపీ పెట్టుకుని అధికారుల నుంచి డబ్బు కొట్టేశాడో కేటాగాడు. ఇప్పుడు ఓ సైబర్ మోసగాడు ఎమ్మెల్యే ఫొటోతో ఫేక్ ఇన్ స్టా అకౌంట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడ్డాడు. వెయ్యి మంది యువకులను మోసం చేసి సుమారు రూ.3 కోట్లు కొట్టేశాడు. ఉద్యోగం అనే మాటను ఆయుధంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు.
(నిందితుడు వంశీకృష్ణ)
హైదరాబాద్‌లో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేటుగాడు వెయ్యికి పైగా మంది అమ్మాయిలను చీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే ఫొటోతో ఫేక్ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ మోసగాడు వంశీకృష్ణ మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాల పేరిట రూ.3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల అంచనా వేస్తున్నారు. నిందితుడి వంశీకృష్ణపై ఇప్పటికే 50 కేసులు నమోదు అయ్యాయి. ఇంజినీరింగ్ చదివిన వంశీకృష్ణ అమ్మాయిలకు మామమాటలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. మాటలతో అమ్మాయిలను బుట్టలో వేసుకుని లక్షల్లో డబ్బు గుంజేస్తాడు. ఏకంగా వెయ్యికి పైగా అమ్మాయిలు వంశీకృష్ణ చేతిలో మోసపోయారంటే అతడి మాయమాటలు చెప్పడంలో ఎంత ఎక్స్ పర్ట్ అర్థం అవుతోంది. ఇలా ఎంతో మందిని తన మాటలతో మోసం చేసి అక్షరాల మూడు కోట్ల రూపాయలకు పైగా కొట్టేశాడు. ఐదేళ్ల క్రితం వంశీ కృష్ణ మోసాలు వెలుగుచూశాయి. గతంలో ఒకసారి జైలుకు కూడా వెళ్లోచ్చాడు. బెయిల్‌పై బయట తిరుగుతున్న ఈ కేటుగాడు మళ్లీ పాత దందాకు తెరదీశాడు.
యానం ఎమ్మెల్యే ఫొటోతో
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సైబర్ మాయగాడు చిక్కాడు. ఇన్ స్టాలో ఏకంగా వెయ్యి మంది అమ్మాయిలను నమ్మించి మోసం చేశాడు. ఇంజినీరింగ్ చదివిన వంశీకృష్ణ గత ఐదేళ్లుగా మోసాలకు అలవాటు పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు గాలం వేయడం మొదలుపెట్టిన వంశీకృష్ణ, 2017లో బాధితుల ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. జైలు జీవితం అనుభవించినా మార్పురాలేదు సరికదా మరింతగా రెచ్చిపోయాడు. ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసి ఏకంగా యానం ఎమ్మెల్యే ఫొటోను తన ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్నాడు. అది మొదలు తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఛారిటీ ఏర్పాటు సేవలందిస్తుంటానని అమ్మాయిలకు గాలం వేసేవాడు. ఇన్ స్టాలో మాయమాటలతో అమ్మాయిలను నమ్మించేవాడు. తనపై నమ్మకం కలిగేందుకు ముందుగా వారి అకౌంట్ లో యాభై వేలు రూపాయలు ట్రాన్ఫర్ చేసేవాడు.
గతంలో ప్రియురాలితో కలిసి మోసాలు
అలా నమ్మించిన తరువాత ఉద్యోగాలు ఆశ చూపి లేదా ఛారిటీ పేరుతో డబ్బులు దండుకోవడం మొదలు పెడతాడు వంశీకృష్ణ. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది అమ్మాయిలను మోసం చేశాడు. మూడు కోట్లకు పైగా కాజేసి ముంచేశాడు. బాధితుల్లో కొందరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో వంశీకృష్ణ బాగోతం బయటపడింది. నేషనల్ క్రైమ్ పోర్టల్ లో వంశీకృష్ణపై యాభైకి పైగా కేసులు నమోదయ్యాయి. పద్నాలుగు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ అయ్యాయి. గతంలో ప్రియురాలితో కలసి మోసాలకు పాల్పడిన వంశీకృష్ణ ఆ తరువాత సింగిల్ గా అమ్మాలను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. బాధితుల ఫిర్యాదుతో వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. మోసపోయిన బాధిత మహిళలు ఇంకా ఉన్నారని, వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామంటున్నారు పోలీసులు.