Crime News: ఏపీలో దారుణాలు - డబ్బులివ్వలేదని భార్య గొంతు కోసి చంపేసిన భర్త, మరోచోట భర్త అనుమాన వేధింపులతో భార్య ఆత్మహత్య
Andhra News: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. విజయవాడలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య గొంతు కోసి హతమార్చాడు. అటు, కర్నూలులో భర్త అనుమానపు వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకుంది.
Husband Killed His Wife In Vijayawada: విజయవాడలో (Vijayawada) దారుణం జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంసాలిపేటలో షేక్ నగీనా (32) అనే మహిళ తన భర్త షేక్ బాజీతో (35) కలిసి నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్ కాగా.. ఆమె స్థానికంగా ఓ సమోసాల దుకాణంలో పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన బాజీ రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈరోజు కూడా మద్యం మత్తులో ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే భార్యను డబ్బులివ్వాలని అడగ్గా. ఆమె లేవని చెప్పడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయాడు. కత్తితో నగీనా గొంతు కోసి హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
అటు, కర్నూలు జిల్లా ఆదోనిలో భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోనిలోని అమరావతి నగర్‌కు చెందిన శ్రీనివాసులకు, వాల్మీకినగర్‌కు చెందిన పావనికి 2021లో పెద్దలు పెళ్లి చేశారు. శ్రీనివాసులకు ఇది రెండో పెళ్లి కాగా.. వీరికి 8 నెలల కుమార్తె ఉంది. శ్రీనివాసులు వాటర్ వర్క్స్‌లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే, భార్య పావనిపై భర్త శ్రీనివాసులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పావని ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్త, ఆడపడుచులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహిళ దారుణ హత్య
అనంతపురం జిల్లాలో ఓ మహిళ ఆదివారం దారుణ హత్యకు గురైంది. కల్యాణదుర్గం మండలం ఉప్పొంకకు చెందిన నాగమ్మ అనే మహిళ భర్తతో విడిపోయి అనంతలోని ఎర్రనేలకొట్టాలకు వచ్చి ఓ భవనంలోని పై పోర్షన్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరు స్థానికంగా ఓ హోటల్‌లో పని చేస్తున్నారు. ఆదివారం పనిలోకి రాకపోవడంతో హోటల్ యజమానికి కిందింటి వారికి సమాచారం ఇచ్చాడు. వారు వెళ్లి చూడగా నాగమ్మ విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై పోక్సో కేసు
మరోవైపు, ఇదే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో బాలికను అపహరించిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పార్లపల్లి గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడి మాయమాటలు నమ్మి అతనితో వెళ్లింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకునితో ఎందుకు వెళ్లావంటూ బాలికను మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు బాలికను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Konaseema News: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు!