దైవదర్శనం కోసం ఫోన్ నెంబర్ తీసుకున్నాడు- ఇప్పుడు జైల్లో ఉన్నాడు
ఆలయానికి వచ్చిన మహిళను పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. అంతే తన ఒరిజినాల్టీ చూపించాడు.
ఏకంగా ఒక నేవీ అధికారి భార్యపైనే కన్నేశాడు ఓ హోం గార్డు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ ఆమెను ట్రాప్ చెయ్యాలని చూశాడు. చివరికి కటకటాల పాలై రిమాండ్‌కు వెళ్లాడు. విశాఖ రూరల్‌లోని పీఎం పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మధురవాడలోని ఉడా కాలనీలో నివాసం ఉంటున్న మహిళ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. రుషికొండలో ఈ మధ్య ప్రారంభమైన వెంకటేశ్వర దేవాలయాలనికి ఆమె తరచూ వెళుతుంది. గత జూన్ 28న కూడా అదేవిధంగా గుడికి వెళ్లింది. అక్కడే హోం గార్డుగా పని చేస్తున్న లంకా వెంకట వీర సర్వేశ్వరరావు ఆమెను పరిచయం చేసుకున్నాడు. వచ్చినప్పుడల్లా హోంగార్డు పరిచయం పెంచుకుని దర్శనం చేయించాడు. ఎప్పుడు గుడికి వచ్చినా ఇలానే వేగంగా దర్శనం చేయిస్తానంటూ ఆమె నెంబర్ తీసుకున్నాడు.
కట్ చేస్తే ఫోన్ నెంబర్ తీసుకునప్పటి నుంచి ఆమెకు వాట్సాప్ ద్వారా దేవుని ఫోటోలు పంపుతూ ఉండేవాడు. అయితే గత కొన్ని రోజులుగా అసభ్యకరమైన ఫోటోలు, పోర్న్ వీడియోలు పంపడం స్టార్ట్ చేశాడు. పొరపాటున వచ్చాయేమో అని ఒక రోజు సైలెంట్‌గా ఉండిపోయింది. రెండో రోజు కూడా అలాంటి మెసేజ్‌లు రావడంతో ఆమె భయాందోళనకు గురైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.
కాసేపటి తర్వాత మళ్లీ ఫోన్ స్విచాన్ చేసింది. అయినా మెసేజ్‌ల వరద ఆగలేదు. కంటిన్యూగా ఫొటోలు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఇక ఓపిక పట్టలేక పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఎంటర్ అయ్యారు. హోంగార్డు ఆట కట్టించారు.
విచారణ జరిపిన పోలీసులు అతను అసభ్యకరమైన ఫోటోలు పంపడం నిజమే అని గుర్తించినట్టు తెలిపారు. దానితో అతణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు . అనంతరం జడ్జి ఆదేశాల మేరకు హోంగార్డును రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో బాధిత మహిళ ఒక నేవీ డాక్టరు భార్య అని తెలుస్తోంది.
అందుకే కాస్త పరిచయం ఉన్నా... పూర్తి వివరాలు తెలియనివారికి ఫోన్ నెంబర్లు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.