Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!
ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో పాటుగా, నిఘా పెట్టటంతో ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కలసి బతుకలేమనే భయంతో వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్ళి ప్రాణాలు విడిచారు.
తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటంతో పాటుగా, నిఘా పెట్టటంతో ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కలసి బతుకలేమనే భయంతో వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్ళి ప్రాణాలు విడిచారు.
గుంటూరులో ప్రేమికుల ఆత్మహత్య....
పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్దానికంగా కలకలం రేపింది. తమ ప్రేమని పెద్దలు వ్యతిరేకించటంతో పాటుగా తమ కదలికలపై కూడా నిఘా పెట్టటంతో వారు జీవితం పైనే ఆశలు కోల్పోయారు. దీంతో ఆ యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.
ప్రేమికులపై కుటుంబసభ్యుల నిఘా....
సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి మూడు రోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని ఆమె స్నేహితులు గమనించారు. అయితే అదే సమయంలో తమ కుమార్తె కనిపించటం లేదని త్రివేణి తల్లిదండ్రులు స్నేహితులను వాకబు చేయటంతో.. శ్రీకాంత్ తో వెళ్ళినట్లుగా సమాచారం అందించారు. త్రివేణి కుటుంబ సభ్యులు మంగళవారం చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్ గుర్తించారు. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఆమె దుస్తులు, ఒంటిపై బంగారం ఆధారంగా గుర్తించారు. మృతి చెందింది తమ కుమార్తె అని త్రివేణి కుటుంబ సభ్యులు నిర్ధారించుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తెనాలి రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
వారం రోజులు పాటు ఏం జరిగింది...
మంగళవారం నాడు త్రివేణి,శ్రీకాంత్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అయితే అంతకు ముందు వారం రోజులు ఇద్దరు ఎక్కడెక్కడకు వెళ్లారేనే దాని పై కూడ కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. తమ ప్రేమ వ్యవహరాన్ని తల్లిదండ్రులతో పాటుగా మిగిలిన మిత్రులకు చెప్పి వారి సపోర్ట్ తీసుకునేందుకు త్రివేణి, శ్రీకాంత్ ప్రయత్నించారని భావిస్తున్నారు. అయితే కుటుంబ వ్యవహరం కావటంతో తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవటం మంచిదని చాలా మంది వారికి సూచించారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి వివాహం చేసుకోవాలని భావించారు. వివాహం తరువాత అయినా పెద్దలను ఎదిరించి సమాజంలో బతకటం కష్టమని భావించారని స్నేహితులు అంటున్నారు. కుటంబం నుంచి, స్నేహితుల నుంచి కూడా త్రివేణి, శ్రీకాంత్ కు భరోసా దక్కలేదు. దీంతో చివరకు మరణమే శరణ్యమని భావించి వేగంగా వస్తున్న రైలుకు ఎదురు వెళ్లారని భావిస్తున్నారు.
మంగళవారం రాత్రి సమయంలో త్రివేణి, శ్రీకాంత్ రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతలకు చేరుకున్నారని,స్దానికులు చెబుతున్నారు. అయితే ఇరువురు జంటగా ఉండటంతో స్దానికుంగా ఉన్న వారు వారిని ప్రశ్నించలేదు. ఇద్దరు కలసి మాట్లాడుకుంటున్నారని, ఆ సమయంలో వారు ఆత్మహత్యకు పాల్పడతారనే అనుమానం కలగలేదని స్థానికులు తెలిపారు. అయితే చీకటి పడి తరువాత రైలుకు అడ్డంగా వెళ్లి, ఇరువురు ఒకేసారి ప్రాణాలు విడవటం స్థానికులను కలచి వేసింది. అటు గ్రామంలో వీరి ఆత్మహత్య వ్యవహరం తెలియటంతో విషాదం అలుముకుంది.